ఉచిత సివిల్‌ శిక్షణకు ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

ఉచిత సివిల్‌ శిక్షణకు ఆహ్వానం

May 9 2026 9:43 AM | Updated on May 9 2026 9:43 AM

ఉచిత సివిల్‌ శిక్షణకు ఆహ్వానం మహాసభల సమన్వయకర్తగా వెంకటరమణ ‘గంగకత్వ’కు గ్రీన్‌ సిగ్నల్‌

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): తెలంగాణ మైనార్టీ స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో సివిల్‌ పరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్న మైనార్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు, జిల్లా మైనా ర్టీశాఖ అధికారి నాగరాజమ్మ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ పరీక్షలకు ఉచిత కోచింగ్‌ అందించనున్నట్లు తెలిపారు. 21 సంవత్సరాల నుంచి 32 సంవత్సరాలు ఉన్న మైనార్టీ అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఈ నెల 31 వరకు దరఖాస్తుల స్వీకరణ, జూన్‌ 14న స్క్రీనింగ్‌ పరీక్ష నిర్వహించి, అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఎంపికై నా వారికి హైదరాబాద్‌లో ఉచిత వసతి, భోజన సౌకర్యంతో శిక్షణ అందించనున్నట్లు చెప్పారు.

బెజ్జంకి(సిద్దిపేట): తెలుగు ప్రపంచ సాహిత్య మహాసభల సమన్వయకర్తగా ప్రముఖ కవి ఆచార్యురాలు వెంకటరమణను నియమించినట్లు కళావేదిక జాతీయ అధ్యక్షుడు ప్రతాప్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. బెజ్జంకి మండల కేంద్రానికి చెందిన వెంకటరమణ సిద్దిపేట డిగ్రీ కళాశాలలో తెలుగు సహాయాచార్యులుగా పని చేస్తున్నారు. జూన్‌ 6, 7వ తేదీల్లో ఏడవ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించనున్నారు. వెంకటరమణకు అరుదైన గౌరవం ఇవ్వడంపై కళాశాల ప్రిన్సిపాల్‌ సునీత, వైస్‌ ప్రిన్సిపాల్‌ అయోధ్యరెడ్డి, తెలుగు శాఖ అధ్యక్షుడు సంపత్‌కుమార్‌తో పాటు మండల సాహిత్య అభిమానులు అభినందించారు.

విత్తనాల ఎంపికలో అప్రమత్తం

వ్యవసాయ శాస్త్రవేత్త శ్వేత

మిరుదొడ్డి(దుబ్బాక)/చిన్నకోడూరు(సిద్దిపేట): సాగులో విత్తనాల ఎంపిక చాలా కీలకమని, ప్రతి రైతుకు అవగాహన ఉండాలని వ్యవసాయ శాస్త్రవేత్త డా.శ్వేత అన్నారు. మిరుదొడ్డిలో శుక్రవారం నిర్వహించిన రైతుల ముంగిట్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. వానాకాలం సాగు పద్ధతులపై రైతులకు అవగాహన కలిగించారు. అధిక మోతాదులో యూరియా వినియోగిస్తే భూ సారం దెబ్బతింటుందని, చీడపీడల బెడద ఎక్కువై దిగుబడులు తగ్గిపోతాయని చెప్పారు. ఉద్యానశాఖ అధికారి రమేశ్‌, సర్పంచ్‌ మహేశ్వరి, ఏఈఓలు ప్రశాంత్‌, అఖిల్‌, రేఖ, సమజాత తదితరులు పాల్గొన్నారు. అలాగే చిన్నకోడూరు మండల పరిధిలోని రామునిపట్లలో సమతుల్య ఎరువుల వినియోగంపై శాస్త్రవేత్తలు ఉష, శంకరి మీనా, సెంథిల్వేల్‌ సేతుపతి అవగాహన కల్పించారు. పంట మార్పిడి చేస్తూ సేంద్రియ ఎరువులు వాడాలని సూచించారు. నూనె గింజల పరిశోధనాసంస్థ అధికారి నిహారిక, ఏఈఓ స్వర్ణ పాల్గొన్నారు.

మంత్రి ఉత్తమ్‌తో కలిసి ఇరిగేషన్‌

అధికారులతో జగ్గారెడ్డి సమావేశం

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: నిజాంకాలం నాటి సాగునీటి కాలువ గంగకత్వ ఆధునీకరణ పనులకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దశాబ్దాల కాలంగా నిర్లక్ష్యానికి గురైన ఈ కాలువ మరమ్మతులకు రూ.42 కోట్లు మంజూరుకు ప్రభుత్వం అంగీకరించింది. ఈ కాలువ ఆధునీకరణ చేపట్టాలని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దృష్టికి గతంలో తీసుకెళ్లడంతో ఈ పనులకు మోక్షం లభించింది. నీటి పారుదలశాఖ ఈ కాలువ ఆధునీకరణ పనుల కోసం అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రతిపాదనలను పరిశీలించిన నీటి పారుదలశాఖ ఈ నిధుల మంజూరు చేయాలని నిర్ణయించింది. ఈ పనులపై శుక్రవారం సచివాలయంలో మంత్రి ఉత్తమ్‌తో కలిసి జగ్గారెడ్డి నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశమై చర్చించారు. సదాశివపేట మండలం సూరారం గ్రామం నుంచి ప్రారంభమయ్యే ఈ గంగకత్వ కాలువ 11 గ్రామాల శివారుల మీదుగా మాచిరెడ్డిపల్లి వరకు పారుతుంది. దీనికి 33 ఫీడర్‌ చానల్‌లు ఉన్నాయి. ఈ కాలువను ఆధునీకరిస్తే అదనంగా మూడు వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఈ పనుల్లో భాగంగా కాలువకు లైనింగ్‌ పనులు చేపడతారు. కాలువపై అవసరం ఉన్న చోట్ల కొత్త బ్రిడ్జిల నిర్మాణం చేపడతారు. ఇప్పటికే ఉన్న బ్రిడ్జిలకు, తూములను మరమ్మతులు చేస్తారు. ఈ పనులకు త్వరలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేస్తారని జగ్గారెడ్డి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement