● ఇబ్బందులు పడుతున్న ప్రజలు
టెన్షన్..
సాక్షి, సిద్దిపేట: పశ్చిమాసియా యుద్ధం ప్రభావం ఇక్కడి ప్రజలపై పడుతోంది. గ్యాస్ దిగుమతి అంతంత మాత్రంగా అవుతుండటంతో గ్యాస్ సంక్షభం ఏర్పడింది. కొత్త గ్యాస్ కనెక్షన్ల మంజూరు నిలిచిపోయింది. ఫలితంగా వినియోగదారులు సతమతమవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 3,33,850 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. సిలిండర్ల కోసం వినియోగదారులు ఏజెన్సీల ఎదుట బారులు తీరుతున్నారు. ఒక సిలిండర్ ఉన్నవారు డబుల్ సిలిండర్ కోసం యత్నిస్తున్నారు. గ్యాస్ ఏజెన్సీల వెబ్‌సైట్లో కొత్త కనెక్షన్లు, డబుల్ గ్యాస్ సిలిండర్ దరఖాస్తు ఆప్షన్‌ను మార్చి 11న క్లోజ్ చేశారు. కొత్త గ్యాస్ కనెక్షన్లు దాదాపు 50 రోజుల నుంచి నిలిచిపోయాయి. గతంలో ఏ కంపెనీ ఏజెన్సీని సంప్రదించినా కనెక్షన్ వెంటనే మంజూరు చేసేవారు. నూతన కనెక్షన్ల మంజూరు కోసం ప్రత్యేక డ్రైవ్‌ను సైతం ఏర్నాటు చేసేవారు. ప్రస్తుతం పరిస్థితి భిన్నంగా ఉంది.
కొత్త గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం లేదు
సిద్దిపేట శివారులో ఇటీవల టిఫిన్ సెంటర్‌ను ప్రారంభించా. గ్యాస్ కొరత ఏర్పడటంతో హోటల్ నిర్వహణ కష్టంగా మారింది. కమర్షియల్ గ్యాస్ నూతన కనెక్షన్ కోసం గ్యాస్ ఏజెన్సీల చుట్టూ తిరిగినా ఇవ్వడం లేదు. ఇంట్లో వినియోగించే సిలిండర్ వినియోగిస్తే అధికారులు తనిఖీ చేసి స్వాధీనం చేసుకుంటున్నారు. దీంతో తప్పని పరిస్థితుల్లో కట్టెల పొయ్యిపై వంటలు చేస్తూ హోటల్‌ను నిర్వహిస్తున్నాను. ఇప్పటికై నా అధికారులు స్పందించి నూతన గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేయాలని కోరుతున్నా. –బైరి శ్రీనివాస్, పొన్నాల
ఆలస్యంగా డెలివరీ
గ్యాస్ సిలిండర్ కోసం ఆన్‌లైన్‌లో బుక్ చేసినా డెలివరీ ఆలస్యమవుతోంది. గతంలో జిల్లాకు ప్రతి రోజు 15వేల గ్యాస్ సిలిండర్‌లో వచ్చేవి ఇప్పుడు దాదాపు 5వేల లోపే సిలిండర్లు దిగుమతి అవుతున్నాయి. బుక్ చేసిన వారం నుంచి 10 రోజులకు డెలివరీ అవుతోంది. దీంతో సింగిల్ సిలిండర్ ఉన్న వారు గ్యాస్ అయిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారు. కొందరికి కట్టెల పొయ్యే దిక్కవుతోంది.


