నీటిపారుదల శాఖ ఎస్‌ఈ లక్ష్మణ్
మర్కూక్(గజ్వేల్): రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సాగునీటి అభివృద్ధి కార్యక్రమాలు రైతాంగానికి ఎంతో మేలు చేస్తున్నాయని జిల్లా నీటిపారుదల శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ (ఎస్‌ఈ) లక్ష్మణ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రగతి ప్రణాళిక’కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మర్కూక్ మండల కేంద్రంలోని కొండపోచమ్మ రిజర్వాయర్ పంప్‌హౌస్ వద్ద నీటిపారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు వారోత్సవాలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిజర్వాయర్లు, కాల్వలు, పంపు హౌజ్‌ల అభివృద్ధితో గ్రామీణ ప్రాంతాల్లో భూగర్భ జలాలు గణనీయంగా వృద్ధి చెందాయన్నారు. దీంతో వ్యవసాయానికి అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు. రైతులు నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడంతో పాటు నీటి సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. తక్కువ నీటితో అధిక దిగుబడులు సాధించేందుకు ఆధునిక సాగు విధానాలను అవలంభించాలన్నారు. రైతుల సంక్షేమం, ప్రతి ఎకరాకు సాగునీరు అందించడం ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు. కార్యనిర్వహణాధికారి వీటీటీ శ్రీనివాస్ మాట్లాడుతూ.. సాగునీరు సమర్థవంతంగా అందించడంలో రైతుల భాగస్వామ్యం ఎంతో కీలకమన్నారు. నీటి వినియోగంలో రైతులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే నీటి వనరులను దీర్ఘకాలం సంరక్షించుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాణి, గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, డిప్యూటీ ఇంజనీర్లు శ్రీధర్, చండీరాం, భాస్కర్, జీవన్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, డివిజన్ స్థాయి అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు, రైతులు హాజరయ్యారు.


