సాక్షి, సిద్దిపేట: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత తొలిసారిగా రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టులలో జిల్లా వారికి అవకాశం దక్కింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి పదవుల కోసం జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. రెండున్నరేళ్ల తర్వాత పద్మశాలి సహకార కార్పొరేషన్ చైర్మన్‌గా సిద్దిపేటకు చెందిన గుడూరు శ్రీనివాస్, మున్నూరుకాపు సహకార కార్పొరేషన్ చైర్మన్‌గా హుస్నాబాద్‌కు చెందిన బొమ్మ శ్రీరాం నియమితులయ్యారు.ఈ మేరకు సీఎస్ రామకృష్ణారావు నియామక ఉత్తర్వులను బుధవారం జారీ చేశారు.
సుడా చైర్మన్ భర్తీ ఎప్పడో?
జిల్లాకు చెందిన పలు చైర్మన్, డైరెక్టర్ నామినేటెడ్ పోస్టులు ఇంకా భర్తీ చేయలేదు. సిద్దిపేట అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(సుడా), సిద్దిపేట మార్కెట్ కమిటీ చైర్మన్‌లతో పాటు డైరెక్టర్ పోస్టులను రెండున్నరేళ్లుగా ఖాళీగానే ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే భర్తీ చేస్తే ఒక మారు పదవీకాలం ముగిసేది. మరికొందరికీ అవకాశం వచ్చేది. ఈ నామినేటెడ్ పోస్టులకు ఎంతో మంది ఆశలు పెట్టుకున్నారు. అలాగే త్వరలో ఖాళీ అయ్యే రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టులలో జిల్లాకు అవకాశం కల్పించాలని, ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నేతలు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌కు విన్నవించుకున్నారు.
పద్మశాలీల సంక్షేమానికి కృషి
పద్మశాలి సహకార కార్పొరేషన్ చైర్మన్‌గా సిద్దిపేటకు చెందిన గుడూరు శ్రీనివాస్ నియమితులయ్యారు. గతంలో సిద్దిపేట మార్కెట్ కమిటీ చైర్మన్‌గా పని చేశారు. ప్రస్తుతం టీపీసీసీ చేనేత సెల్ రాష్ట్ర అధ్యక్షునిగా శ్రీనివాస్ కొనసాగుతున్నారు. అసెంబ్లీ ,పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా పద్మశాలి కులస్తులను కలిసి అభ్యర్థుల విజయం కోసం కృషి చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్‌కు శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. పద్మశాలీల అభివృద్థికి, కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు కృషి చేస్తానన్నారు.
సామాజిక సేవే లక్ష్యంగా..
మున్నూకాపు సహకార కార్పొరేషన్ చైర్మన్‌గా హుస్నాబాద్‌కు చెందిన బొమ్మ శ్రీరాం చక్రవర్తి నియమితులయ్యారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో హౌసింగ్ సొసైటీ చైర్మన్‌గా పని చేశారు. 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో హుస్నాబాద్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు. మున్నూరుకాపు విద్యార్థుల కోసం హాస్టల్‌ను నిర్వహిస్తూ, సామాజిక సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. నియామకంపై సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్‌లకు బొమ్మ శ్రీరాం చక్రవర్తి కృతజ్ఞతలు తెలిపారు.
కార్మిక సంఘం నాయకుడిగా..
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా దరిపల్లి చంద్రం నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ దేవసేనా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. బీఎన్‌ఆర్‌కేఎస్ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా, టీపీసీసీ కార్యవర్గ సభ్యుడిగా దరిపల్లి చంద్రం కొనసాగుతున్నారు. కార్మిక సంఘం నాయకుడిగా, సీనియర్ కాంగ్రెస్ నాయకులుగా అందరికీ సుపరిచితులు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా విధులు నిర్వహించిన కేడం లింగమూర్తి , హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడంతో రాజీనామా చేశారు. దీంతో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఖాళీగా ఏర్పాడింది. దీంతో దరిపల్లి చంద్రంను గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా నియామకమయ్యారు.
జిల్లాకు రెండు రాష్ట్ర స్థాయి చైర్మన్ నామినేటెడ్ పోస్టులు
పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్‌గా గుడూరు శ్రీనివాస్
‘మున్నూరుకాపు’ చైర్మన్‌గా బొమ్మ శ్రీరాం చక్రవర్తి
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా దరిపల్లి చంద్రం


