● తేమ శాతం తప్పనిసరి
● రైతులతో కలెక్టర్ హైమావతి
హుస్నాబాద్: ధాన్యాన్ని తేమ శాతం వచ్చే వరకు ఆరబెట్టుకొని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని కలెక్టర్ హైమావతి రైతులకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డును కలెక్టర్ సందర్శించి మక్కలు, ధాన్యం కొనుగోలు ప్రక్రియను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ హైమావతి మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం ఆరబెట్టడం వల్ల అకాల వర్షాలతో పెద్ద ఎత్తున నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. వ్యవసాయ మార్కెట్‌లో మక్కలు, ధాన్యానికి సరిపడా స్ధలం లేదన్నారు. వరి ధాన్యాన్ని మీకు దగ్గరలోని గ్రామాల కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవాలని సూచించారు. ఏఎంసీలో పల్లపు ప్రాంతంలో ధాన్యం ఆరబెట్టకుండా ఫ్లక్సీలు ఏర్పాటు చేయాలని ఆధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ రామ్మూర్తి, ఏఎంసీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, ఇతర శాఖల అధికారులు ఉన్నారు.
ఆగిన కొనుగోళ్లు.. రోడ్డెక్కిన రైతులు
మిరుదొడ్డి(దుబ్బాక): చెప్యాల అల్వాల క్రాస్ రోడ్డు వద్ద నిర్వహిస్తున్న వడ్ల కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులు రోడ్డెక్కారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన దిగారు. పది రోజులుగా కొనుగోళ్లు పూర్తిగా నెమ్మదించడంతో రోజుల తరబడి ఎండలో నానా అవస్థలు పడుతున్నామని రైతులు మండిపడ్డారు. అకాల వర్షాల వచ్చి ధాన్యం తడిస్తే ఎవరి బాధ్యత అంటూ రైతులు అసహనం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న దుబ్బాక సీఐ ఆందోళన వద్దకు చేరుకుని రైతులకు నచ్చజెప్పే క్రమంలో పోలీసులకు, రైతులకు వాగ్వాదం చోటు చేసుకుంది. కాగా ఇదే సమయంలో అటుగా వెళుతున్న ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి రైతుల ఆందోళనకు సంఘీభావం తెలుపుతూ రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందన్నారు. కలెక్టర్‌తో సహా అధికారుల నిర్లక్ష్యం వల్లే కొనుగోళ్లు నిలిచిపోతున్నాయని ఆరోపించారు. కొనుగోళ్లు వేగవంతం చేయకుంటే రైతులతో కలిసి కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. సుమారు గంట పాటు జరిగిన రైతుల ఆందోళనతో గజ్వేల్, మిరుదొడ్డి రహదారులకు ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
సంఘీభావం తెలిపిన ఎమ్మెల్యే


