టీసీఏ అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి
సిద్దిపేటజోన్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించిన టీజీ20 ప్రీమియర్ లీగ్‌ను తక్షణమే నిలిపివేయాలి రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ జిల్లా కన్వీనర్ నరేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బీసీసీఐ నిబంధనలు అతిక్రమించిందని ఆరోపించారు. ముందస్తు అనుమతి లేకుండా టీ20 నిర్వహించడం చట్టవిరుద్ధమన్నారు. యువ క్రీడాకారుల భవిష్యత్తుపై ప్రభావం పడుతుందన్నారు. సమావేశంలో ప్రతినిధులు బాలరాజు, ఉమాపతి, శ్రీనివాస్ హరి తదితరులు పాల్గొన్నారు.
సిద్దిపేటఅర్బన్: టీఎస్‌ఎప్‌సెట్ పరీక్షలో భాగంగా అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులలో ప్రవేశాల కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్షలు మంగళవారం ముగిశాయి. ఇందూరు ఇంజినీరింగ్ కళాశాలలో సీబీటీ విధానంలో జరిగిన ప్రవేశ పరీక్షకు 50 మందికి గాను 49 మంది హాజరయ్యారు. అలాగే ఈ నెల 9 నుండి 11 వరకు ఇంజినీరింగ్ కోర్సులో ప్రవేశాల కోసం పరీక్షలు నిర్వహించనున్నారు. కాగా పరీక్షలను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వీపీ రాజు, అబ్జర్వర్ భాస్కర్, టీసీఎస్ ఆఫీసర్ అప్సర్, పీఆర్వో రఘు, సిస్టం అడ్మిన్ షాదుల్లా పర్యవేక్షించారు.
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): జిల్లాకు చెందిన కవియిత్రి ఎడ్ల లక్ష్మికి బాలసాహితి మూర్తి పురస్కారం వరించింది. తెలంగాణ సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన బాలసాహిత్య సమ్మేళన కార్యక్రమంలో పురస్కారం స్వీకరించినట్లు బాలసాహితీవేత్త ఉండ్రాళ్ల రాజేశం తెలిపారు. ఎడ్ల లక్ష్మి రచించిన ‘వెన్నెల వెలుగులు’ పుస్తకావిష్కరణ జరిగినట్లు తెలిపారు. కార్యక్రమంలో పరిషత్ అధ్యక్షుడు ఎల్లూరి శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి చెన్నయ్య, రిటైర్డ్ ఐఏఎస్ రమణాచారి, వరప్రసాదరెడ్డి, పత్తిపాక మోహన్, గరిపల్లి మోహన్ తదితరులు పాల్గొన్నట్లు తెలిపారు.
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): రైతులు వరి, మొక్కజొన్న, పత్తి లాంటి సాంప్రదాయ పంటలే కాకుండా రైతులు హార్టికల్చర్, సెరికల్చర్ వైపు దృష్టి సారించాలని, ఉద్యాన శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు రైతులకు సూచించారు. మంగళవారం జిల్లా కేంద్రంలో ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖల ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఉద్యాన పంటల సబ్సిడీ వివరాలు, అధునాతన పద్ధతిలో సాగు, మల్బరీ, పట్టు పురుగుల పెంపకం ఆయిల్‌పామ్ పంటల గురించి వివరించారు. మల్బరీ సాగుతో నెల నెలా ఆదాయం వస్తుందని రైతులు ఆ దిశగా ముందుకు సాగాలన్నారు. పంటల మార్పిడితోనే అధిక లాభాలు వస్తాయన్నారు. కార్యక్రమంలో నంగునూరు ఏఎంసీ చైర్మన్ దేవులపల్లి యాదగిరి, చిన్నకోడూరు ఏఎంసీ చైర్మన్ మహేందర్, ఉద్యాన శాఖ ఉమ్మడి జిల్లా సహాయ సంచాలకులు ఇంద్రసేనారెడ్డి, ఆయా శాఖల అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.


