ప్రగతి మెరవలె..
మన గ్రామాలు వెనుకబాటు
● తాజాగా కేంద్ర ప్రభుత్వం నివేదిక
● జిల్లా ఫ్రంట్ రన్నరప్‌గా ముద్దాపూర్
● తొమ్మిది అంశాలలో జిల్లా టాప్ గ్రామాల వెల్లడి
సాక్షి, సిద్దిపేట: మన పల్లెలు అభివృద్ధికి దూరంగా ఉంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఏడాది పంచాయతీ అభివృద్ధి సూచికను(పీఏఐ) విడుదల చేస్తోంది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పీఏఐ 2.0ను ఇటీవల కేంద్ర గ్రామీణాబివృద్ధి శాఖ విడుదల చేసింది. జిల్లాలోని 508 గ్రామ పంచాయతీలలో ఏ ఒక్క పంచాయతీ జాతీయ, రాష్ట్ర స్థాయిలో రాణించలేదు. వచ్చే నివేదికలోనైనా జాతీయ, రాష్ట్ర స్థాయిలలో నిలిచేందుకు సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామస్తులు కృషి చేయాల్సిన అవసరం ఉంది.
ఫ్రంట్ రన్నర్‌గా..
పంచాయతీ అభివృద్ధి సూచిక 2.0లోని 9 అంశాలలో కుకునూరుపల్లి మండలం ముద్దాపూర్ పంచాయతీ 76.21 మార్కులు సాధించి జిల్లా ఫ్రంట్ రన్నర్‌గా నిలిచింది. అలాగే చైల్డ్ ఫ్రెండ్లీ పంచాయతీగా ముద్దాపూర్ 88.68 మార్కులు సాధించింది. గ్రామంలో 700 జనాభా ఉంటుంది. వ్యవసాయమే జీవనాధారంగా కొనసాగుతుంది. గ్రామంలో కూరగాయలు సైతం పండిస్తున్నారు. గతేడాది కేంద్ర బృందాలు పర్యటించి గ్రామాలను పరిశీలించాయి.
9అంశాలలో పరిశీలన
తొమ్మిది అంశాలలో గ్రామాలను పరిశీలించారు. వర్షం నీటిని ఇంకించడం. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడం. పచ్చదనం ఏర్పాటు చేయడం. స్వయం సమృద్ధి సదుపాయాలను సమకూర్చుకోవడం. సామాజిక న్యాయం అమలు చేయడం, మహిళలకు ఇబ్బందులు లేకుండా చూడటంతో పాటు మొత్తంగా పంచాయతీ పాలన మెరుగ్గా ఉండేలా సర్పంచ్‌లు మరింత చొరవ తీసుకోవాలి.


