● మీ కోసమే మేమున్నాం
● సీపీ రష్మీ పెరుమాళ్
● కోహెడలో ‘మన పోలీస్–మన ఊరు’
కోహెడరూరల్(హుస్నాబాద్): పోలీసులు అంటే భయం వద్దని, మన కోసం పని చేస్తున్నారనే భావన ప్రజల్లో కలగాలని సీపీ రష్మీ పెరుమాళ్ అన్నారు. మన పోలీస్–మన ఊరు కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆమె కోహెడలో ఎస్‌ఐ అభిలాష్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీపీకి గ్రామ మహిళలు ఘన స్వాగతం పలికారు. అనంతరం సీపీ మట్లాడుతూ ఏప్రిల్ 1న ప్రారంభమైన మన పోలీస్–మన ఊరు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందన్నారు. తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోకపోవడం, డ్రగ్స్, మద్యం వంటి సామాజిక సమస్యలపై పోలీసులకు వినతులు అందుతున్నాయని వీటిని గ్రామస్తుల సమక్షంలోనే పరిష్కరిస్తామని చెప్పారు.
భద్రతకు ప్రాధాన్యం..
కోహెడ పోలీస్‌స్టేషన పరిధిలో ఏర్పాటు చేసిన 30 సీసీ కెమెరాలను సీపీ ప్రారంభించారు. అనంతరం స్టేషన్ ఆవరణంలో మొక్కలు నాటిన సీపీ ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేశారు. అలాగే మండలంలోని 27 గ్రామాలకు వాలీబాల్ కిట్లను పంపిణీ చేసి వాలీబాల్ మ్యాచ్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ సుభాస్ చంద్రబోస్, ఏసీపీ సదానందం, సీఐ శ్రీనివాస్, సర్పంచ్ సుజాత తదితరులు ఉన్నారు.


