అర్జీలు సత్వరమే పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

అర్జీలు సత్వరమే పరిష్కారం

May 5 2026 7:02 AM | Updated on May 5 2026 7:02 AM

అర్జీలు సత్వరమే పరిష్కారం ● కలెక్టర్‌ హైమావతి ● ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులు 69

● కలెక్టర్‌ హైమావతి ● ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులు 69

సిద్దిపేటరూరల్‌: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను అర్హతల మేరకు పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ హైమావతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల వినతులను కలెక్టర్‌ స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి అర్హతల మేరకు వెంటనే పరిష్కరించే దిశగా అధికారులు కృషి చేయాలన్నారు. వివిధ సమస్యల పరిష్కారం కోసం అర్జీలు 69 వచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సిద్దిపేట, హుస్నాబాద్‌, గజ్వేల్‌ ఆర్డీవో కార్యాలయంలో కూడా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి దరఖాస్తులను స్వీకరించినట్లు తెలిపారు.

అకాల వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

వచ్చే వారం రోజుల్లో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు ముందస్తు ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని కలెక్టర్‌ హైమావతి సూచించారు. వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడవకుండా టార్పాలిన్లు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. పీఏసీఎస్‌ కేంద్రాల్లో మొక్కజొన్న కొనుగోలు చేపట్టాల్సి ఉందని, ఇందుకు సంబంధించి ఇప్పటికే 10 వేల గన్ని బ్యాగులు సరఫరా చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు సుమారు 30 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని సమీపంలోని రైస్‌ మిల్లులకు వెంటనే తరలించాలని, దూర ప్రాంతాలకు కూడా అవసరం మేరకు రవాణా సదుపాయాలు కల్పిస్తున్నట్లు కలెక్టర్‌ స్పష్టం చేశారు.

సిద్దిపేటరూరల్‌: ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని నిరుద్యోగ యువకుల కోసం ఈ నెల 8న సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న జాబ్‌ మేళాకు జిల్లాలోని యువకులు అధిక సంఖ్యలో పాల్గొని, ఉద్యోగాలకు సాధించాలని కలెక్టర్‌ హైమావతి కోరారు. సోమవారం కలెక్టరేట్‌లోని మీటింగ్‌ హాల్‌లో ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక జాబ్‌ మేళా పోస్టర్లను సంబంధిత శాఖల అధికారులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ప్రైవేట్‌ రంగంలో ఉద్యోగ అవకాశాన్ని కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం.. ఈనెల 8న ఉదయం 8 గంటల నుంచి సంగారెడ్డి పట్టణంలోని తార డిగ్రీ కాలేజీలో జాబ్‌ మేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నదన్నారు. 250 పైగా వివిధ రంగాలకు చెందిన ప్రైవేట్‌ కంపెనీలు పాల్గొని తమ కంపెనీలకు, సంస్థలకు అవసరమైన వారిని ఎంపిక చేసుకుంటారన్నారు. 10వ తరగతి, ఇంటర్మీడియెట్‌, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఇంజనీరింగ్‌, ఫార్మసీ వీటితో పాటు ఇతర అన్ని రకాల అర్హతలు కలిగిన వారు ఈ జాబ్‌ మేళాలో పాల్గొని ఉద్యోగ అవకాశాన్ని పొందాలని కలెక్టర్‌ యువతకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ, యువజన సర్వీసుల శాఖ అధికారి శ్రీనివాస్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ రమేష్‌, డీపీఆర్‌ఓ రవికుమార్‌, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement