టీఎస్‌ఎప్‌సెట్‌ తొలిరోజు ప్రశాంతం | - | Sakshi
Sakshi News home page

టీఎస్‌ఎప్‌సెట్‌ తొలిరోజు ప్రశాంతం

May 5 2026 7:02 AM | Updated on May 5 2026 7:02 AM

సిద్దిపేటఅర్బన్‌: ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సులలో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న టీఎస్‌ఎప్‌సెట్‌ పరీక్ష ఇందూరు ఇంజనీరింగ్‌ కళాశాలలో సోమవారం ప్రశాంతంగా జరిగింది. తొలి రోజు అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల ప్రవేశాల కోసం పరీక్ష నిర్వహించారు. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లుగా సీబీటీ విధానంలో నిర్వహించారు. ఉదయం సెషన్‌కు 50 మంది విద్యార్థులకు 49 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం సెషన్‌కు సైతం 49 మంది హాజరై పరీక్ష రాశారు. పరీక్షల నిర్వహణను ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వీపీ రాజు, అబ్జర్వర్‌ భాస్కర్‌, టీసీఎస్‌ ఆఫీసర్‌ అప్సర్‌, పీఆర్వో రఘు పర్యవేక్షించారు.

నిబంధనలు తప్పనిసరి

సిద్దిపేటకమాన్‌: పురపాలక నిబంధనలను కచ్చితంగా పాటించాలని సీపీ రష్మీ పెరుమాళ్‌ తెలిపారు. రాబోయే బక్రీద్‌ పండుగ సందర్భంగా పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో సీపీ సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వధశాలలకు సంబంధించిన చట్టపరమైన నిబంధనలను పాటిస్తూ, అక్రమ వధను నివారించాలన్నారు. నిబంధనలకు అనుగుణంగా జంతువుల రవాణా వంటి అంశాలపై చర్చించినట్లు తెలిపారు. జంతువులు అక్రమ రవాణా నివారించడానికి కమిషనరేట్‌ పరిధిలో చెక్‌ పోస్టులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్‌ అయేషా ఫాతిమా, అడిషనల్‌ డీసీపీ కుశాల్కర్‌, ఏసీపీ రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.

జీవన ఎరువులతో

సేద్యానికి జీవం

ములుగు(గజ్వేల్‌): రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి జీవన ఎరువులను ఉపయోగించడంతో భూసారాన్ని పెంచవచ్చని హార్టికల్చర్‌ జాయింట్‌ డైరెక్టర్‌ కె.రామలక్ష్మి సూచించారు. వ్యవసాయ శాఖ రైతు వారోత్సవం సందర్భంగా నేల ఆరోగ్య పరిరక్షణ, సమతుల్య ఎరువుల యాజమాన్యం, ప్రకృతి వ్యవసాయం అనే అంశాలపై సోమవారం ములుగు రైతువేదికలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ రసాయన ఎరువుల వాడకం వల్ల నేలలోని సూక్ష్మజీవరాశి నశించి భూమి నిస్సారమవుతోందన్నారు. కూరగాయ పంటలు, వాటి యాజమాన్యం గురించి రైతులకు వివరించారు. ప్రతి గ్రామం నుంచి ఐదుగురు రైతుల చొప్పున మట్టి నమూనాలను సేకరించి పరీక్షలు చేయించి వారికి సాయిల్‌ హెల్త్‌కార్డులు అందజేశారు. కార్యక్రమంలో వంటిమామిడి మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ ప్రభాకర్‌గుప్త, రైతులు పాల్గొన్నారు.

‘ఉపాధి’ కూలీల సమస్యలు

పరిష్కరించండి

గజ్వేల్‌రూరల్‌: ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీల సమస్యలను పరిష్కరించాలని డీబీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండస్వామి అన్నారు. ఉపాధి హామీ కూలీల పరిరక్షణ యాత్రలో భాగంగా సోమవారం మండల పరిధిలోని శ్రీగిరిపల్లిలో జరుగుతున్న ఉపాధి హామీ పనుల వద్ద కూలీల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్‌ఎంఎంఎస్‌ ద్వారా కూలీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతిని కొనసాగించాలన్నారు. అదే విధంగా కనీస సౌకర్యాలైన నీరు, నీడ, ప్రథమ చికిత్స కిట్‌లను అందుబాటులో ఉంచాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టానికి తూట్లు పొడుస్తుందని, కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలీల పక్షాన ఉంటూ వీబీరామ్‌జీ బిల్లును రద్దు చేసేలా కృషి చేయాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement