● సీట్లు సైతం పెంపు ● ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత ● కొనసాగుతున్న ‘దోస్త్’ ప్రక్రియ
సిద్దిపేటఎడ్యుకేషన్: సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాలలో నూతన కోర్సులను ప్రవేశపెడుతున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత చెప్పారు. దోస్త్ ప్రక్రియ కొనసాగుతోందని విద్యార్థులు షెడ్యూల్ ప్రకారం తమ అడ్మిషన్లకై వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. సోమవారం కళాశాలలో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు రెండు నూతన అప్రెంటిస్‌షిప్ ఎంబీడెడ్ డిగ్రీ ప్రొగ్రాం(ఏఈడీపీ) కోర్సులను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. కొత్తగా బీఎస్సీ ఫార్మాస్యూటికల్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ అండ్ క్వాలిటీ, బీఎస్సీ ఫిషరీస్ అండ్ అక్వాకల్చర్(ఏఈడీపీ) కోర్సులను ఆసక్తిగల విద్యార్థులు ఎంపిక చేసుకోవాలని సూచించారు. బీఎస్సీ లైఫ్‌సైన్సెస్‌లో మెడికల్ ఫిజియాలజీ అనే నూతన సబ్జెక్టులను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. ఈ విద్యాసంవత్సరానికి వివిధ కోర్సుల్లో సీట్లను సైతం పెంచినట్లు చెప్పారు. బీఏ(సీబీసీఎస్) ఇంగ్లిష్‌మీడియంలో ప్రస్తుతం ఉన్న 180 సీట్లతో పాటు మరో 60 సీట్లు, బీస్సీ ఫిజికల్ సైన్స్ (సీబీసీఎస్)లో 300ల సీట్లతో పాటు మరో 60 సీట్లు పెంచినట్లు చెప్పారు. ప్రస్తుతం కళాశాలలో మొత్తం 1920 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. దోస్త్ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుందని, ఈ నెల 7వరకు మొదటి విడత అడ్మిషన్ల ప్రక్రియ ఉంటుందని దోస్త్ కోఆర్డినేటర్ డాక్టర్ భాస్కర్ చెప్పారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర అయోధ్యరెడ్డి, అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ మధుసూదన్, అధ్యాపకులు పాల్గొన్నారు.


