పురపీఠం దక్కేదెవరికి..?
ఆశావహుల ముమ్మర ప్రయత్నాలు
హుస్నా’బాద్‌షా’ఎవరు..?
చేర్యాల కుర్చీ చేజిక్కించేదెవరు..?
దుబ్బాకలో హోరాహోరీ
గజ్వేల్‌లో రసకందాయం
వైస్ చైర్మన్ ‘బరి’లో ఇద్దరు
జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలో చైర్మన్ పదవి కోసం ఆశావహులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. కౌన్సిలర్లను క్యాంపులకు తరలించిన పార్టీలు.. చైర్మన్‌గా ఎవరిని నియమించాలనే విషయమై తర్జనభర్జన పడుతున్నాయి. అయితే.. హుస్నాబాద్‌లో మంత్రి పొన్నం, గజ్వేల్, దుబ్బాక, చేర్యాలలో మాజీ మంత్రి హరీశ్‌రావుల కటాక్షం ఉన్న వారికే పీఠం దక్కుతుందని చర్చ జరుగుతోంది.
సాక్షి, సిద్దిపేట: జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలలో చైర్మన్, వైస్ చైర్మెన్ ఎవరెవరిని వరిస్తుందో అని జోరుగా చర్చించుకుంటున్నారు. గజ్వేల్, దుబ్బాక, చేర్యాల మున్సిపాలిటీలు బీఆర్‌ఎస్కు, హుస్నాబాద్ బల్దియా పీఠం కాంగ్రెస్‌కు దక్కనున్నాయి. ఆయా పార్టీల్లో చైర్మన్ పదవి కోసం ఆశావహులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అన్ని పార్టీలు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రిసార్టులు, ఫామ్ హౌస్‌లలో క్యాంపులను ఏర్పాటు చేసి వారిని తరలించారు.
హుస్నా’బాద్ షా’ఎవరు..
హుస్నాబాద్ మున్సిపాలిటీలో 20 వార్డులుండగా 16 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. బల్దియా చైర్మన్ గిరిని ఆశించిన కేడల లింగమూర్తి ఓటమి చెందారు. రెండవ వార్డు నుంచి గెలుపొందిన బూరుగు లత, పదవ వార్డుకు చెందిన సావుల మంజుల, 14వ వార్డుకు చెందిన దండి లక్ష్మి, 19వ వార్డు కు చెందిన బత్తుల స్వరూపలు ఆశిస్తున్నారు. 2014 దండి లక్ష్మి ఇండిపెండెంట్‌గా గెలుపొంది అప్పుడు చైర్మన్ గిరి కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. మంత్రి పొన్నం ఆశీస్సులు ఎవరికి ఉంటే వారికే చైర్మన్ పీఠం దక్కనుంది.
చేర్యాల పీఠం దక్కేదెవరికి..?
చేర్యాల మున్సిపాలిటీలో 12 వార్డులకు గాను 7 వార్డుల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. చేర్యాల బల్దియా చైర్మన్ ఎస్సీ మహిళలకు రిజర్వ్ అయింది. 6వ వార్డు నుంచి కౌన్సిలర్‌గా గెలుపొందిన ముస్త్యాల అరుణ, 2వ వార్డు నుంచి గెలుపొందిన కమలాపురం గీతాంజలిలు పుర పీఠంను ఆశిస్తున్నారు. ఆర్ అండ్ బీలో డీఈఈగా పదవీ విరమణ పొందిన తర్వాత బీఆర్‌ఎస్ చేరిన బాలనర్సయ్య కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన సతీమణి ముస్త్యాల అరుణ కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.
ఎడతెగని ఉత్కంఠ
గజ్వేల్: గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ క్యాంపు రాజకీయం రసకందాయంలో పడింది. చైర్మన్ ఎన్నికకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌తోపాటు ఇండిపెండెంట్‌తో కలుపుకొని 12 కౌన్సిలర్ స్థానాలను సాధించిన బీఆర్‌ఎస్ కట్టుదిట్టమైన ఏర్పాట్లతో క్యాంపు నడుపుతోంది. పనిలోపనిగా రెండు ఎక్స్‌గ్రేషియో ఓట్లను బీఆర్‌ఎస్ సిద్ధం చేసుకున్నది. ఇందులో స్థానిక ఎమ్మెల్యే, మాజీ సీఎం కేసీఆర్ కాగా, మరొకరు ఉమ్మడి మెదక్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి ఉన్నారు. కాగా చైర్మన్ పీఠం కోసం 17వార్డు కౌన్సిలర్ కళ్యన్‌కర్ పద్మబాయి, 19వవార్డు కౌన్సిలర్ గంగిశెట్టి చందనలు పోటీపడుతుండగా.. వీరిలో ఎవరిని ఎంపిక చేస్తారనే అంశంపై ఉత్కంఠ నెలకొన్నది.
గజ్వేల్: మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి కోసం సైతం పోటాపోటీ ప్రయత్నాలు కూడా తెరమీదికి వచ్చాయి. రెండవ వార్డులో మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ సతీమణి(బీజేపీ)పై అధిక మెజార్టీతో విజయం సాధించిన గోలీ మమత, 20వవార్డులో ఇండిపెండెంట్‌గా గెలుపొందిన అత్తెల్లి శ్రీనివాస్ తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వీరిద్దరిలో ఎవరిని ఎంపిక చేయాలనే అంశంలోనూ పార్టీ ముఖ్యనేతలు తర్జనభర్జన పడుతున్నారు. ఇక ఏడు కౌన్సిలర్ స్థానాలను సాధించిన అధికార కాంగ్రెస్ పార్టీ సైతం క్యాంపు రాజకీయాలకు నడపటం కూడా ఆసక్తిని రేకేత్తిస్తున్నది.
దుబ్బాక ఎవరికో?
దుబ్బాక: మున్సిపాలిటీలో 20 వార్డులకు గాను బీఆర్‌ఎస్ నుంచి 11 మంది కౌన్సిలర్లు, కాంగ్రెస్ 4, బీజేపీ నుంచి ఇద్దరు, ఏఐఎఫ్‌బీ నుంచి ఒకరు, ఇండిపెండెంట్లు ఇద్దరు గెలుపొందారు. బీఆర్‌ఎస్‌కు మరో ఇండిపెండెంట్ అభ్యర్థి సైతం చేరడంతో ఆ పార్టీ బలం 12కు చేరుకుంది. మరో ఇద్దరు కౌన్సిలర్లు సైతం బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉన్నారు. ఈ క్రమంలో 12వ వార్డు కౌన్సిలర్ బండి శ్రీలేఖ, 19వ వార్డు కౌన్సిలర్ శ్రీరాం సంగీత చైర్‌పర్సన్ పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆశీస్సులున్న వారే చైర్‌పర్సన్ అయ్యే అవకాశాలు ఉంటాయి.


