నారాయణఖేడ్: పాఠశాలలు పునఃప్రారంభమైన మూడు రోజుల్లోనే సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో నో అడ్మిషన్ బోర్డును ఏర్పాటు చేశారు. ప్రతీ ఏడు పాఠశాలలు పునఃప్రారంభమయ్యాక రెండు నెలల అనంతరం ఈ బోర్డు ఏర్పాటు చేసేవారు. ఈసారి మాత్రం బడులు ప్రారంభమైన మూడు రోజుల్లోనే విద్యార్థులు భారీగా చేరగానో అడ్మిషన్ బోర్డును ఏర్పాటు చేశారు. గతేడాది 880మంది విద్యార్థులు అడ్మిషన్లు జరగగా గదుల్లో చాలా ఇబ్బందులు పడుతూ విద్యభ్యాసం కొనసాగించారు. టెన్త్ పరీక్షలు రాసి ఉత్తీర్ణులై 165మంది విద్యార్థులు వెళ్లిపోగా పాఠశాలల పునఃప్రారంభం రోజుకు 715మంది విద్యార్థులున్నారు. బడులు ప్రారంభం అయ్యాక మూడు రోజుల్లోనే 120మంది విద్యార్థులు కొత్తగా అడ్మిషన్లు పొందారు. విద్యార్థులకనుగుణంగా ఏ, బీ సెక్షన్లను ఏర్పాటు చేసినప్పటికీ గదులు అందుబాటులో లేని కారణంగా ఆరవ తరగతి ఇంగ్లిష్ మీడియంలో కొంతమంది విద్యార్థులు మినహాయించి ఇతర తరగతుల్లో అడ్మిషన్లు ఫుల్ అయ్యాయని నో అడ్మిషన్ల బోర్డును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కొత్తగా చేరిన 120 మంది విద్యార్థులతో కలిపి మొత్తం 835మంది విద్యార్థులకు చేరింది. తెలుగు, ఇంగ్లీష్ మీడియం కలిపి టెన్త్ వరకు ఉన్న ఈ పాఠశాలలో 13 మాత్రమే గదులు ఉండగా 22మంది అధ్యాపకులు పనిచేస్తున్నారు. 2022–23వ సంవత్సరంలో 756మంది విద్యార్థులు, 2023–24లో 800 మంది, 2024–25లో 880మంది విద్యార్థులు చేరారు.
ఖేడ్ సర్కారీ బడిలో బోర్డు ఏర్పాటు
బడులు ప్రారంభమైన మూడు రోజులకే పూర్తయిన అడ్మిషన్లు


