సంగారెడ్డి ఎడ్యుకేషన్: జిల్లాలో మొక్కజొన్న, వరి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో రెవెన్యూ డివిజనల్ అధికారులు, ఎస్‌డీపీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, వ్యవసాయ, సహకార, పౌరసరఫరాలు, మార్క్‌ఫెడ్, మార్కెటింగ్, డీఆర్‌డీవో తదితర శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. జిల్లాలో సుమారు 10 వేల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలు కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందన్నారు. వెంటనే మొక్కజొన్నలు కొనుగోలు చేసి రైతులకు నిర్ణీత సమయంలో చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కొన్ని రైస్ మిల్లుల్లో ధాన్యం అన్‌లోడింగ్ ఆలస్యం చేస్తున్న విషయంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, అదనపు కలెక్టర్లు సంగీత, పాండు, సబ్ కలెక్టర్ ఉమా హారతి, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
యుద్ధప్రాతిపదికన మౌలిక వసతులు
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక వసతుల పనులను పూర్తి చేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షించారు. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు తప్పనిసరిగా ఉండాలన్నారు. అవసరమైన చోట టాయిలెట్స్, తాగునీరు, విద్యుత్ సౌకర్యం వంటి పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని కోరారు. ఎంపీడీవోలు పాఠశాలలను సందర్శించినప్పుడు టాయిలెట్స్, తాగునీరు, ఇతర కనీస వసతుల పరిస్థితిని తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ పాండు, జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ శాఖల అధికారులు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశం
అన్‌లోడింగ్ ఆలస్యంపై ఆగ్రహం


