● మహిళా కూలీ మృతి
చేర్యాల(సిద్దిపేట): తాలు పట్టే యంత్రంలో తల వెంట్రుకలు చిక్కుకొని మహిళా కూలీ మృతి చెందింది. ఈ ఘటన మండల పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం... ని కాశగుడిశెలు గ్రామానికి చెందిన షేక్ ఇమాంబీ(55) కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తుంది. ఈ క్రమంలో గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో తాలు పట్టే పనికి వెళ్లింది. ట్రాక్టర్‌కు అనుసంధానంగా ఉన్న మిషన్ సహాయంతో ధాన్యంలో తాలును శుభ్రం చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు ఆమె తల వెంట్రుకలు యంత్రంలో చిక్కుకొని మిషన్‌కు తగలడంతో తీవ్రంగా గాయపడింది. గమనించిన స్థానికులు వెంటనే మిషన్ ఆప్‌చేసి ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయగా అప్పటికే ఆమె మృతి చెందింది. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ అపూర్వరెడ్డి వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. మృతురాలికి భర్త, నలుగురు కుమార్తెలు ఉన్నారు. గతంలో కుమారుడు కిడ్నీలు చెడిపోయి మృతిచెందగా నేడు ప్రమాదంలో ఆమె చనిపోవడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
ఏసీబీకి చిక్కిన కార్యదర్శి, సర్పంచ్ భర్త
● రూ.10వేల లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం
● అరెస్టు చేసిన అధికారులు
కొమురవెల్లి(సిద్దిపేట): ఓ వ్యక్తి నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటూ పంచాయతీ కార్యదర్శి గడ్డం రాజుగౌడ్, సర్పంచ్ భర్త గొల్లపల్లి ఆంజనేయులు ఏసీబీకి చిక్కారు. సోమవారం ఏసీబీ మెదక్ రేంజ్ డీఎస్పీ సుదర్శన్ వివరాలు వెల్లడించారు. కొమురవెల్లి గ్రామానికి చెందిన ఫిర్యాదు దారుడి ప్లాట్‌లో గతంలో గ్రామ పంచాయతీ అధికారులు డ్రైనేజీ పైపులైన్ వేశారు. ఆ పైపులైన్‌ను తొలగించాలని బాధితుడు పంచాయతీ కార్యదర్శి గడ్డం రాజుగౌడ్‌ను ఆశ్రయించాడు. దీంతో రూ.25 వేలు లంచం ఇస్తేనే పైపులైన్‌ను తొలగిస్తామని చెప్పాడు. దీంతో బాధితుడు మొదటగా రూ.10 వేలు పంచాయతీ కార్యదర్శి రాజుకు ఇచ్చాడు. మిగతా డబ్బులు చెల్లిస్తేనే పని అవుతుందనడంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఈనెల 4న ఫిర్యాదు చేశాడు. దీంతో సోమవారం పక్కా ప్రణాళికతో పంచాయతీ కార్యదర్శి ఆదేశాల మేరకు సర్పంచ్ పద్మ భర్త ఆంజనేయులు రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వారిలో ఏ1గా పంచాయతీ కార్యదర్శి రాజు, ఏ2 గా గొల్లపల్లి ఆంజనేయులుపై కేసు నమోదు చేసి, హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నట్లు తెలిపారు.
200 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం స్వాధీనం
● రైస్‌మిల్లుపై కేసు నమోదు
దుబ్బాకటౌన్: రైస్‌మిల్లులో అక్రమంగా నిల్వ ఉన్న రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్, టాస్క్‌ఫోర్స్ డీఎస్పీ వెంకటేశం వివరాల ప్రకారం... విశ్వసనీయ సమాచారం మేరకు రాయపోల్ మండలం వడ్డేపల్లి గ్రామంలో పౌర సరఫరాల శాఖ అధికారులు, విజిలెన్స్ – ఎన్ఫోర్స్మెంట్ టాస్క్‌ఫోర్స్ బృందాలు సాయి వీరభద్ర రైస్‌మిల్లులో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సుమారు 200 క్వింటాళ్ల పీడీఎస్ సన్నబియ్యం అక్రమంగా నిల్వ ఉంచినట్లు గుర్తించారు. బియ్యాన్ని స్వాధీనం చేసుకొని, ఎంఎల్‌ఎస్ పాయింట్లకు తరలించారు. ఈ ఘటనపై రాయపోల్ పోలీస్ స్టేషన్‌లో నిత్యావసర వస్తువుల చట్టం –1955 కింద 6 (ఏ) కేసు నమోదు చేశారు. టాస్క్‌ఫోర్స్ సీఐ పాండరి, ఎస్సై వెంకటేశ్వర్లు, రాయపోల్ ఎస్‌ఐ మానస, పౌరసరఫరాల అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


