సిద్దిపేట జిల్లా వేసవి విహారానికి చక్కని ప్రదేశంగా మారుతోంది. ఇక్కడున్న రిజర్వాయర్లు, మరెన్నో ప్రకృతి అందాలు, ఆలయాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉండటం వల్ల ఇక్కడికి వచ్చే పర్యాటకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ వస్తున్నది.
– గజ్వేల్:
జిల్లాలో 3 టీఎంసీల సామర్థ్యంతో రంగనాయకసాగర్ రిజర్వాయర్, 50టీఎంసీల సామర్థ్యంతో మల్లన్నసాగర్, మరో 15టీఎంసీల సామర్థ్యంతో కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్‌ల నిర్మాణం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టుల్లో భాగంగా నిర్మించిన ఈ ఈ రిజర్వాయర్‌లోకి మేడిగడ్డ నుంచి ఎత్తిపోతల ద్వారా వివిధ బ్యారేజీలు, రిజర్వాయర్ల మీదుగా జిల్లాలోని రంగనాయక్‌సాగర్, మల్లన్నసాగర్ ద్వారా కొండపోచమ్మసాగర్‌లోకి గోదావరి జలాలు వస్తున్నాయి. ఈ రిజర్వాయర్ల వద్ద కట్టపై విహరించడం పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచుతున్నది. రిజర్వాయర్లలోకి నీటిని పంపుల ద్వారా విడుదల చేసే సమయాల్లో పిల్లాపాపలతో పర్యాటకులు భారీగా ఇక్కడికి చేరుకొని గొప్ప అనుభూతి పొందుతున్నారు. బోటింగ్‌తో పాటు పర్యాటకులను పసందు చేయడానికి మరెన్నో ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొండపాక మండలం లకుడారం శివారులో 3,400ఎకరాల్లో విస్తరించి ఉన్న మల్లన్నవనం సహజమైన అందాలతో అలరారుతోంది. అలాగే.. సిద్దిపేటలోని కోమటిచెరువు, గజ్వేల్‌లోని పాండవుల చెరువులు పర్యాటకులు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఇకపోతే కొమురవెళ్లి మల్లన్న ఆలయం, కొండపోచమ్మ ఆలయం, వర్గల్‌లోని విద్యాసరస్వతీ ఆలయాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.


