మార్కెట్ యార్డుల్లో పేరుకున్న ధాన్యం దృష్టిసారించని అధికారులు
ఇరవై రోజులుగా రైతుల పడిగాపులు
దుబ్బాకటౌన్: పొద్దుతిరుగుడు, మొక్కజొన్న పంటలను విక్రయించడానికి రైతులు నానా అవస్థలు పడుతున్నారు. సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్, తొగుట, మిరుదొడ్డి మార్కెట్ యార్డుల్లో పొద్దుతిరుగుడు ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం నెలకొనడంతో ఆందోళనకు గురవుతున్నారు. పంటను విక్రయించేందుకు మార్కెట్ యార్డులకు తీసుకువచ్చి నెల రోజులుగా పడిగాపులు కాస్తున్నామని, అయినా కాంటా వేయడంలేదని వాపోతున్నారు. జిల్లాలో దాదాపు 50 వేల ఎకరాలలో మొక్కజొన్న సాగు చేయగా 15 కొనుగోలు సెంటర్లు ప్రారంభమయ్యాయి. అలాగే 16 వేల ఎకరాలలో పొద్దుతిరుగుడు సాగు చేయగా కేవలం 8 కొనుగోలు కేంద్రాలు మాత్రమే ప్రారంభించారు.
మార్కెట్లో రక్షణ కరువు
మార్కెట్ యార్డుల్లో నిల్వ ఉంచిన పంటకు రక్షణ లేకపోవడం, ఎండలు, వర్షాలు, గాలివానల ప్రభావంతో నాణ్యత దెబ్బతింటోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటను కాపాడుకోవడానికి అదనపు ఖర్చు భరించాల్సి వస్తోందని, రాత్రింబవళ్లు యార్డుల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
కొనుగోలు కేంద్రాలు
మరిన్ని అవసరం
రాయపోల్, దౌల్తాబాద్ మండలంలో పొద్దుతిరుగుడు, మొక్కజొన్న పంటల సాగు అధికం. అయినా ప్రభుత్వం ఇక్కడ కొనుగోలు కేంద్రాలను ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదు. ఇంకా ఆలస్యం చేస్తే భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు వాపోయారు. కాగా.. రైతులు ధాన్యం కోసి నెల రోజులు గడుస్తున్నా రైతుల పక్షన అండగా ఉండాల్సిన ఉమ్మడి దౌల్తాబాద్ ఏఎంసీ చైర్మన్ కనీసం పట్టించుకోవడం లేదని రైతులు మండిపడుతున్నారు.
పరిమితిని ఎత్తివేయాలి
ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం ఎకరానికి 6.60 క్వింటాళ్ల వరకే పొద్దుతిరుగుడు పంటను కొనుగోలు చేస్తున్నారని, అయితే ఈ సీజన్‌లో ఎకరానికి 10 నుంచి 12 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తోందని రైతులు చెబుతున్నారు. ఈ పరిస్థితిలో మిగిలిన పంటను ఎక్కడ విక్రయించాలో తెలియక అయోమయంలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పరిమితిని ఎత్తివేసి రైతులు పండించిన మొత్తం పంటను ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
కాంటా కోసం నిరీక్షణ
నేను మూడెకరాలలో పొద్దు తిరుగుడు పంట సాగు చేశా. ధాన్యం కోసి ఆరబోసి మార్కెట్‌కు తీసుకువచ్చా.. సుమారు ఇరవై రోజులుగా కాంటా కోసం నిరీక్షిస్తున్నా. మేము గజ్వేల్ మార్కెట్ యార్డుకు ధాన్యం తీసుకవెళ్లి విక్రయించాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. అధికారులు రాయపోల్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి సమస్య తీర్చాలి.
– స్వామి, రైతు, తిమ్మక్కపల్లి


