● కుక్కలను వదిలేసిన కేసులోనలుగురు అరెస్టు ● ఎస్పీ పరితోష్ పంకజ్ వెల్లడి
పటాన్‌చెరు టౌన్: నందిగామ గ్రామ శివారులో 11 సైబీరియన్ హస్కీ కుక్కలు, ఒకటి జర్మన్ షెఫర్డ్ కుక్కలను నిర్లక్ష్యంగా వదిలిపెట్టిన ఘటనలో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనలో ఎండ తీవ్రతను తట్టుకోలేక ఒక హస్కీ కుక్క మృతి చెందగా, మిగిలినవి ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు ఎస్పీ పరితోష్ పంకజ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... పటాన్‌చెరు మండలం భానూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆక్సిజన్ కౌంటీ, కేశవనగర్ వెంచర్ ప్రాంతాల్లో కుక్కలను ఇటీవలే ఐదు రోజుల క్రితం వదిలిపెట్టిన ఘటనపై కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాల ఆధారంగా టీఎస్ 07యూజీ 6451 వాహనాన్ని గుర్తించిన పోలీసులు.. మియాపూర్‌లోని కల్వరీ టెంపుల్ సమీపంలో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. చల్లని వాతావరణంలో జీవించే హస్కీ కుక్కలను కావాలనే ఎండలో వదిలేయడంతో ఒక కుక్క మృతి చెందినట్లు, మిగిలినవి అనారోగ్యానికి గురైనట్లు పేర్కొన్నారు. కుక్కల వయస్సు పెరగడం, వాటిని ఉంచేందుకు స్థలం సరిపోకపోవడం వల్లే నిందితులు ఈ చర్యకు పాల్పడినట్లు ఎస్పీ తెలిపారు. రక్షించిన 11 హస్కీ కుక్కలను స్వాన్ ఎన్‌జీఓకు అప్పగించారు. అలాగే కల్వరీ టెంపుల్‌కు సంబంధించిన లైసెనన్స్ వివరాలపై జీహెచ్‌ఎంసీ అధికారులకు లేఖ రాసినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులు నీతిపూడి సత్యనారాయణ అలియాస్ మోజేష్, వండలూరి సుధీర్ బాబు, సుందర్ సింగ్, డ్రైవర్, అన్నవరం సత్యనారాయణలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తులో కీలక పాత్ర పోషించిన బీడీఎల్ సీఐ విజయ్ కృష్ణ, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.


