ఇద్దరికి తీవ్ర గాయాలు
మిరుదొడ్డి(దుబ్బాక): ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనుకనుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. మండల పరిధిలోని ధర్మారం జాతీయ రహదారిపై గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. దుబ్బాక డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సిద్దిపేట నుంచి దుబ్బాకకు వెళుతోంది. ధర్మారం శివారులో వడ్ల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ను బస్సు ఓవర్ టేక్ చేయబోయి డీకొట్టింది. దీంతో బస్సు ముందు భాగం దెబ్బతిన్నది. బస్సులో ప్రయాణిస్తున్న ధర్మాజీపేటకు చెందిన మనీషా, రామక్కపేటకు చెందిన కొండ రామానుజానికి తీవ్ర గాయాలు కాగా, మరి కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న మిరుదొడ్డి పోలీసులు గాయాల పాలైన ఇద్దరిని దుబ్బాక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
కాపర్ కేటుగాళ్లు
ట్రాన్స్‌ఫార్మర్లలో
20కిలోల కాపర్ వైర్ చోరీ
అక్కన్నపేట(హుస్నాబాద్): చీకటి పడితే చాలు.. కాపర్ కేటుగాళ్లు రంగంలోకి దిగుతున్నారు. గ్రామాల్లో పడి విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను ఊడ్చేస్తున్నారు. పదుల సంఖ్యలో ట్రాన్స్‌ఫార్మర్లను పగులగొట్టి ధ్వంసం చేయడంపై విద్యుత్ శాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కట్కూర్, దాస్‌తండా, దుబ్బతండా గ్రామాల పరిధిలో ఈ సంఘటనలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. అందులో భాగంగా గురువారం మండలంలోని దాస్‌తండా గ్రామ పరిధిలోని వంకాయతండా సమీపంలోని రైతులు దోమ యాదిరెడ్డి, గుగులోతు మల్చూర్ పొలాల్లో ట్రాన్స్‌కో అధికారులు ఏర్పాటు చేసిన రెండు ట్రాన్స్‌ఫార్మర్లను దుండగులు రాత్రి ధ్వంసం చేసి.. అందులోని కాపర్ వైర్‌ను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై విద్యుత్ శాఖ ఏఈ హారీశ్‌రెడ్డి, లైన్‌మేన్ కిషన్‌నాయక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ రెండు ట్రాన్స్‌ఫార్మర్లల్లో సుమారుగా 20 కిలోల వరకు కాపర్ వైర్‌ను దొంగలించారని, వీటి విలువ సుమారు రూ.25వేలకుపైగా ఉంటుందని చెప్పారు.


