● బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో ఈనెల 10న నిర్వహించతలపెట్టిన ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగసభకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు ప్రజలు పెద్దఎత్తున తరలిరావాలని బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి పిలుపునిచ్చారు. సంగారెడ్డిలోని బీజేపీ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీ తెలంగాణ రూ.8 వేల కోట్ల నిధులతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారని అన్నారు. దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. సమావేశంలో మాజీ ఎంపీ బీబీపాటిల్, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి, నియోజకవర్గం ఇన్‌చార్జి రాజేశ్వర్‌రావు దేశ్‌పాండే, నాయకులు డాక్టర్ రాజుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
హైందవ ధర్మం కోసం
పాటుపడాలి
● వీహెచ్‌పీ ఉపాధ్యక్షురాలు సునీతారెడ్డి
జహీరాబాద్ టౌన్: సనాతన ధర్మ పరిరక్షణ, హిందూ ఐక్యత కోసం ప్రతీ ఒక్కరు కృషి చేయాలని వీహెచ్‌పీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సునీతారెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా పట్టణంలో ఆదివారం నిర్వహించి హిందూ సమ్మేళనానికి ఆమె హాజరై మాట్లాడారు. గడప దాటితే అందరం హిందువులని, కుల,మత భేదాలను వీడి అందరూ ఒక్కటికావాలని కోరారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు హిందూ ధర్మం గురించి చెబుతుండాలని చెప్పారు. కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
సకాలంలో ధాన్యం
కొనుగోలు చేయాలి
కొల్చారం(నర్సాపూర్): రైతుల నుంచి సకాలంలో ధాన్యం కొనుగోలు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని తుక్కాపూర్ పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అవసరమైన అన్ని వసతులు కల్పించాలని, ధాన్యం రవాణాలో ఇబ్బందులు తలెత్తకుండా లోడింగ్, అన్ లోడింగ్ వేగవంతం చేయాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో సర్పంచ్ ఆంజనేయులు, ఉప సర్పంచ్ రవీందర్, సీఈఓ నవీన్, బీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గౌరీశంకర్ గుప్తా, యువత అధ్యక్షుడు సంతోశ్‌రావు, గంగయ్య తదితరులు పాల్గొన్నారు.
మల్లన్న ఆలయంలో
భక్తుల రద్దీ
కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ఆలయ పరిసరాలు మల్లన్న నామస్మరణతో మారుమోగాయి. ఆదివారం వేకువజామున నుంచే పుష్కరణిలో స్నానమాచరించి స్వామి వారిని దర్శించుకున్నారు. కొంత మంది భక్తులు గంగరేణి చెట్టు వద్ద పట్నాలు వేసి, ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.


