ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు
నారాయణఖేడ్: పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మూడో విడత నామినేషన్ల పర్వం కూడా పూర్తి కావడంతో ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు తలమునకలయ్యారు. మొదటి విడత పోలింగ్ ఈనెల 11న జరగనుండగా, ప్రచారం చివరి దశకు చేరుకుంది. రెండో విడత గుర్తుల కేటాయింపు పూర్తి కాగా, అభ్యర్థులు ప్రచార పర్వంలో దూసుకెళుతున్నారు. మూడో విడతకు సంబంధించి గుర్తులను ఈనెల 9న కేటాయించనున్నారు. కాగా జిల్లాలో మొదటి విడతలో 136 పంచాయతీలు, 1,246 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
ఉద్యోగులకు శిక్షణ
మొదటి విడత పోలింగ్ నిర్వహణకు సంబంధించి అధికారులకు శిక్షణ ఇప్పటికే పూర్తి చేశారు. పోలింగ్‌లో పాల్గొనే ఉపాధ్యాయులతో పాటు డివిజన్, జిల్లాస్థాయి అధికారులకు ఎన్నికల శిక్షణ ఇస్తున్నారు. రెండో విడత ఎన్నికల నిర్వహణకు సంబంధించి సోమవారం ప్రిసైడింగ్‌్ అధికారులకు వారికి కేటాయించిన మండలంలో శిక్షణ ఇవ్వనున్నారు. మూడో విడతకు సంబంధించిన వారికి 9వ తేదీన శిక్షణ ఇవ్వనున్నారు. 200 మంది ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రంలో ఒక ప్రిసైడింగ్ అధికారి, ఒక పోలింగ్ అధికారిని కేటాయించనున్నారు. 400 లోపు ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రంలో ముగ్గురిని, 400పైగా ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రంలో నలుగురికి కేటాయించనున్నారు. ఎన్నికల సామగ్రిని ఆయా మండలాలకు అధికారులు పంపించి సిద్ధం చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వారీగా బ్యాలెట్ బాక్సులు, స్టేషనరీ మండల కేంద్రాలకు తీసుకొస్తున్నారు. బ్యాలెట్ పత్రాల ప్రింటింగ్‌ను నోడల్ అధికారులుగా నియమించిన జిల్లాస్థాయి అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
ముమ్మర తనిఖీలు
జిల్లాలోని మోర్గి, మాడ్గి, హుసెళ్లి వద్ద పోలీసులు అంతర్‌రాష్ట్ర చెక్ పోస్టులను ఏర్పాటు చేసి కట్టుదిట్టంగా తనిఖీలు చేస్తున్నారు. మండల స్థాయిలో నియమితులైన ఫ్లయింగ్ సర్వైలైన్స్ టీం (ఎఫ్‌ఎస్‌టీ), స్టాటిక్ సర్వైలైన్స్ (ఎస్‌ఎస్‌టీ) టీంలు ముమ్మర తనిఖీల్లో నిమగ్నమయ్యారు. ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలపై నిఘా పెట్టేందుకు స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలను నియమించారు. వీరు వాహనాల రాకపోకలపై నిఘా పెట్టారు. జిల్లా సరిహద్దులోని కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లోని పోలీస్ సిబ్బంది మరింత నిఘాతో వ్యవహరిస్తున్నారు. ఇప్పటివరకు జిల్లాలో రూ. 4.3 లక్షల విలువైన మద్యం పట్టుకుని 77 కేసులు నమోదు చేశారు.
1,450 సమస్యాత్మక
పోలింగ్ కేంద్రాలు
గతంలో నెలకొన్న ఘటనలు, తాజా పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అధికారులు జిల్లాలో 1,450 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా అధికారులు గుర్తించారు. వీటి సంఖ్య పరిస్థితుల దృష్ట్యా పోలింగ్ నాటికి పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇందులో అత్యంత సున్నితమైన పోలింగ్ కేంద్రాలుగా 480గా అధికారులు గుర్తించారు. సమస్యాత్మక కేంద్రాలు గల గ్రామాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. అక్కడ అదనపు బలగాలను మోహరించాలని నిర్ణయించారు. హిస్టరీ షీట్లు, గత ఎన్నికల్లో అల్లర్లు సృష్టించిన 1,080 మందిని ముందస్తుగా తహసీల్దార్ల ఎదుట బైండోవర్ చేస్తున్నారు.
ముగిసిన పంచాయతీ నామినేషన్ల పర్వం
మండలాలకు ఎన్నికల సామగ్రి
తుది దశకు చేరుకున్న మొదటి విడత ప్రచారం


