ఏదీ ప్రభుత్వ భూమి..? | - | Sakshi
Sakshi News home page

ఏదీ ప్రభుత్వ భూమి..?

Nov 1 2025 9:35 AM | Updated on Nov 1 2025 9:35 AM

ఏదీ ప్రభుత్వ భూమి..?

ఏదీ ప్రభుత్వ భూమి..?

పటాన్‌చెరు: దాదాపు దశాబ్దం క్రితం వెలసిన వెంచర్‌ అది. హెచ్‌ఎండీఏ అనుమతులతో వెలసిన ఆ వెంచర్‌లో ఇళ్లు కొని నివాసం ఉంటున్నారు. కానీ ప్రస్తుతం ఆ ఇళ్లను కూల్చేస్తారని చెబుతున్నారు. అవన్నీ ప్రభుత్వ జాగాలో ఉన్నాయని బెదిరిస్తున్నారు. తాము చేసిన తప్పేంటో అర్థంకావడం లేదని బాధితులు వాపోతున్నారు. ఇది సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం అమీన్‌పూర్‌ పటేల్‌గూడ శివారులో రేయిన్‌బో మిడోస్‌లో నివాసం ఉంటున్న వారి వింత పరిస్థితి. వివరాలు.. ఆ వెంచర్‌ మధ్యలో సర్వే నంబర్‌ 208లో ఒక ఎకరా 20 గుంటల ప్రభుత్వ భూమి ఉంది. నేటికీ అది ప్రభుత్వ భూమి అని అక్కడ బోర్డు ఉంది. కానీ కొందరొచ్చి సదరు భూమి ప్రైవేటు భూమి అని, అది సర్వే నంబర్‌ 210 పరిధిలోకి వస్తుందంటూ విక్రయానికి సిద్ధపడ్డారు. పైగా భూమికి పట్టా ఉందని కూడా చెబుతున్నారు. పదేళ్ల క్రితం వెలసిన వెంచర్‌లో కట్టిన ఇళ్లే ప్రభుత్వ భూమిలోకి వస్తాయని వాదిస్తున్నారు.

అయితే.. రెవెన్యూ అధికారులు తాజాగా సర్వే నిర్వహించారు. ఖాళీగా ఉన్న భూమి ప్రైవేట్‌ వ్యక్తులదని, ఇళ్లు కట్టిన స్థలమే ప్రభుత్వ జాగా అని ప్రాథమికంగా నిర్ధారించారు. దాంతో ఇళ్లు కట్టుకున్న వారి గుండె ఝల్లుమంది. తమ ఇళ్లను కూల్చేస్తారేమోనని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్ని అనుమతులు ఉన్నాయని, బ్యాంకు లోన్‌లు తీసుకుని కట్టుకున్న గూడును కూల్చేస్తారేమోనని మనోవ్యథకు లోనవుతున్నారు. స్థానిక నాయకులు కొందరు వారికి అండగా ఉండి న్యాయం చేస్తామని భరోసా కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మళ్లీ సర్వే నిర్వహించి వ్యవహారాన్ని తేల్చుతామని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. దాదాపు పది విల్లాలు ప్రభుత్వ భూమి పరిధిలోకి రానున్నాయి. ఒక్కో విల్లా రూ. రెండు కోట్లపై మాటే. సర్వేనంబర్‌ 208లో ప్రభుత్వ భూమి ఉంది. సర్వే నంబర్‌ 210లో ప్రైవేట్‌ భూమి ఉంది. పొజీషన్‌ ఎక్కడనేది తేల్చాల్సిన అవసరం ఉంది. మొత్తం మీద ప్రభుత్వ భూమిని కాజేసే కుట్ర పెద్ద ఎత్తునే సాగుతుందనే ప్రచారం సాగుతోంది. అమాయక విల్లా ఓనర్లను ఇబ్బందిపెట్టే కార్యక్రమానికి స్కెచ్‌ వేశారనే గుసగుసలు వినపడుతున్నాయి.

సర్వే పూర్తి చేయిస్తాం

జిల్లా స్థాయి సర్వే శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌కు ఆ వివాదాన్ని పరిష్కరించాలని, సమగ్ర సర్వే చేపట్టాలని లేఖ రాశాం. మరోసారి నిష్పక్షపాతంగా జిల్లా స్థాయి అధికారి నేతృత్వంలో సర్వే నిర్వహిస్తేనే సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉంది.

–వెంకటేశ్‌, తహసీల్దార్‌ అమీన్‌పూర్‌

రూ.30 కోట్ల భూమి కాజేసే కుట్ర!

రేయిన్‌బో మిడోస్‌ వెంచర్‌లో వింత వివాదం

విల్లాలే ప్రభుత్వ భూమిలో వచ్చాయంటున్న భూ యజమానులు

తేల్చని రెవెన్యూ శాఖ అధికారులు

లబోదిబోమంటున్న బాధితులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement