‘జిజ్ఞాస’లో ద్వితీయ స్థానం
డిగ్రీ మహిళా కళాశాల విద్యార్థులకు
నగదు, ప్రశంసా పత్రాలు
గజ్వేల్‌రూరల్: జిజ్ఞాస స్టూడెంట్ స్టడీ ప్రాజెక్ట్‌లో భాగంగా రాష్ట్రస్థాయిలో నిర్వహించిన పోటీల్లో గజ్వేల్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థుల బృందం ద్వితీయ స్థానంలో నిలవడం అభినందనీయమని ఆ కళాశాల ప్రన్సిపాల్ ప్రొఫెసర్ అనిత అబ్రహం అన్నారు. శుక్రవారం గజ్వేల్‌లో ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ఉన్నత విద్య ఆధ్వర్యంలో ఈనెల 29, 30 తేదీల్లో హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో రాష్ట్రస్థాయి సమావేశం జరిగిందన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని 149 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు చెందిన విద్యార్థుల మధ్య జరిగిన పోటీల్లో గజ్వేల్‌లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థులు రెండో స్థానంలో నిలిచారన్నారు. ఉన్నత విద్య కమిషనర్, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి దేవసేన చేతుల మీదుగా రూ.18వేల నగదు ప్రశంసా పత్రాలను అందుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్తినులను, అధ్యాపకురాలు ఉమారాణిలను అనిత అబ్రహం అభినందించారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.


