పదేళ్ల తర్వాత.. రాహుల్‌ గాంధీ కొంపముంచింది అదేనా?

Once Rahul Gandhi Tore Up Ordinance Now Punish Him - Sakshi

కర్మ సిద్ధాంతం.. ఈ సిద్ధాంతం ప్రకారం మనిషి చేసే ప్రతి చర్యకి ప్రతిఫలం అనుభవించి తీరాలి. రాహుల్‌ గాంధీ విషయంలోనూ ఇప్పుడు అదే జరిగిందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా నడుస్తోంది. అందుకు కారణం ఒకప్పుడు ఏ ఆర్డినెన్స్‌ అయితే చించేశాడో.. అదే ఆయనపై అనర్హతవేటుపై ప్రభావం చూపెట్టింది. అసలప్పుడు ఏం జరిగిందంటే.. 

'లిల్లీ థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా'లో 2013లో సుప్రీం కోర్టు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ  ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని ఒక సెక్షన్ ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. అదే ప్రజాప్రతినిధ్య చట్టం సెక్షన్‌ 8(4). ఈ సెక్షన్‌ ప్రకారం..  ఏదైనా క్రిమినల్ కేసులో 2 లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష పడిన ప్రజాప్రతినిధికి ఒక వెసులుబాటు కల్పిస్తుంది. శిక్ష తీర్పు వెలువడిన వెంటనే.. ఆ ప్రజా ప్రతినిధిని అనర్హుడిగా ప్రకటించడానికి వీల్లేదు.  అప్పీల్ చేసుకోవడానికి 3 నెలల సమయం ఇవ్వడంతో పాటు ఒకవేళ పైకోర్టు గనుక స్టే విధిస్తే  ఆ అనర్హత నిర్ణయాన్ని వాయిదా వేయాలని ఈ సెక్షన్ చెబుతుంది. అయితే.. లిలి థామస్‌ కేసులో కీలకమైన ఈ సెక్షన్‌ను కొట్టేసింది సుప్రీం కోర్టు. 

కానీ.. 2013లో అప్పటి యూపీఏ ప్రభుత్వంలో కూటమిగా ఉన్న ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్ యాదవ్.. గడ్డి స్కాంలో చిక్కుకుని దోషిగా నిర్ధారణ కావడంతో రెండేళ్ల జైలుశిక్ష పడింది. దీంతో ఆయన అనర్హుడు అయ్యాడు. అయితే ఈలోపే.. యూపీఏ సర్కార్ తన భాగస్వామిని రక్షించుకోవాలని నిర్ణయించింది. సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ.. ప్రత్యేక చట్టసవరణ చేస్తూ ఆఘమేఘాల మీద ఓ ఆర్డినెన్స్ ను తీసుకొచ్చింది. అది దాదాపు ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్‌ 8(4)కు దాదాపు సమానంగా ఉండింది. దీంతో లాలూ ప్రసాద్ యాదవ్ పైకోర్టును ఆశ్రయించే అవకాశం దక్కింది. 

అయితే.. ఆ టైంలో రాహుల్‌ గాంధీ తన సొంత ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను తీవ్రంగా వ్యతిరేకించారు. అది అర్థంలేని ఆర్డినెన్స్‌ అని మండిపడ్డారు. మీడియా సమావేశం నిర్వహించి మరీ అది చెత్త ఆర్డినెన్స్‌ అని, ప్రభుత్వం దాన్ని వెనక్కి తీసుకుంటుందని భావిస్తున్నానని, అది ఉండాల్సింది చెత్త బుట్టలో అంటూ ఆర్డినెన్స్‌ కాపీని చించి పడేశారు. వెంటనే ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ ఆర్డినెన్స్ ను వెనక్కితీసుకుంటూ కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు.  ఆ వెంటనే లాలూ ప్రసాద్‌ యాదవ్‌పై అనర్హత వేటు పడింది.  కాలం గిర్రున తిరిగింది. దాదాపు పదేళ్లు గడిచాయి.   ఇప్పుడు, ఆ ఆర్డినెన్స్ ను చించేసిన రాహుల్ గాంధీ.. తానే స్వయంగా అనర్హతకు గురి కావడం విశేషం. 

2005లో కేరళకు చెందిన లాయర్‌ లిలీ థామస్‌, లోక్‌ ప్రహారీ ఎన్జీవో కార్యదర్శి ఎస్‌ఎన్‌ శుక్లా.. ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్‌ 8(4) రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంలో పిల్‌ పిటిషన్‌ వేశారు.  2013 జులై 10వ తేదీన జస్టిస్‌ ఏకే పట్నాయక్‌, జస్టిస్‌ ఎస్‌జే ముఖోపాధ్యాయ నేతృత్వంలోని ధర్మాసనం.. ఆ సెక్షన్‌ను కొట్టేసింది.

::: సాక్షి వెబ్‌ ప్రత్యేకం
 

Read latest Sakshi Special News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top