నేర్చుకుందాం రా..! | - | Sakshi
Sakshi News home page

నేర్చుకుందాం రా..!

May 12 2026 6:24 AM | Updated on May 12 2026 6:24 AM

సమ్మర్‌ క్యాంపుల వైపు చిన్నారుల చూపు

ఆసక్తి ఉన్న కళలను నేర్చుకునేందుకు పరుగులు

సమ్మర్‌ క్యాంప్‌లతో నైపుణ్యాలకు మెరుగు

చేవెళ్ల: వేసవి శిక్షణ శిబిరాలతో విద్యార్థులకు ఎంతో మేలు చేకూరుతుందని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దేవర సమతారెడ్డి అన్నారు. ఎంఈఓ పురందాస్‌, స్థానిక కౌన్సిలర్లతో కలిసి సోమవారం మోడల్‌ స్కూల్‌లో సమ్మర్‌ క్యాంప్‌ను ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు శిబిరాలు చక్కటి వేదిక అన్నారు. ఇందులో చిత్రలేఖనం, సంగీతం, నృత్యం, యోగా కరాటే, కంప్యూటర్‌ శిక్షణ పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌, సైన్స్‌, క్విజ్‌ తదితర అంశాలపై తర్ఫీదునిస్తారన్నారు. ఎంఈఓ మాట్లాడుతూ.. మండలంలోని 6నుంచి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ఉదయం 8నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తరగతులు కొనసాగుతాయని చెప్పారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ చిన్నపురెడ్డి, కౌన్సిలర్‌ మద్దెల శ్రీనివాస్‌, అధ్యాపకులు పాల్గొన్నారు.

యుద్ధ విద్యలో శిక్షణ పొందుతున్న చిన్నారులు ● కరాటే, కుంగ్‌ఫూపై ఆసక్తి

షాద్‌నగర్‌: శరీరాన్ని విల్లులా వంచుతూ.. మెరుపు వేగంతో కదులుతూ.. ప్రత్యర్థుల నుంచి రక్షణ పొందేందుకు బాలబాలికలు యుద్ధ విద్యలు నేర్చుకుంటున్నారు. ప్రత్యేకమైన డ్రస్‌ ధరించి, నడుముకు బెల్టులు కట్టుకొని, తాము నేర్చుకున్న కళల్ని ప్రదర్శిస్తూ అబ్బురపరుస్తున్నారు. కరాటే, కుంగ్‌ఫూలో శిక్షణ పొందుతూ వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుంటున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో తల్లిదండ్రులు తమ పిల్లలను ఆయా తరగతులకు పంపిస్తున్నారు. పట్టణానికి చెందిన కరాటే మాస్టర్‌ ఎత్తిన చెన్నయ్య, మాస్టర్‌ శ్రీకాంత్‌ ముదిరాజ్‌ తదితరులు పాఠశాలలు, వివిధ కాలనీల్లోని మైదానాల్లో చిన్నారులకు యుద్ధ విద్యలు నేర్పిస్తున్నారు.

శిక్షణ ఇలా..

కరాటే, కుంగ్‌ఫూ నేర్చుకునే ఆసక్తి ఉన్న చిన్నారులకు మొదట కొద్ది రోజుల పాటు సాధారణ వ్యాయాలు నేర్పిస్తారు. క్రమక్రమంగా కరాటే, కుంగ్‌ఫూలో బేసిక్స్‌ చెబుతారు, ఆతర్వాత యుద్ధ విద్యలో మెలకువలు నేర్పిస్తారు. ప్రత్యర్థులు దాడికి వస్తే ఎలా అడ్డుకోవాలి.. ఇందుకు ఎలాంటి టెక్నిక్స్‌ వాడాలన్న విషయాలపై ట్రైనింగ్‌ ఇస్తారు. ప్రత్యర్థుల కదలికలను గమనించడం, వారు దాడి చేసే విధాన్ని పసిగట్టి, డిఫెన్స్‌ చేయడం వంటి అంశాలపై తర్ఫీదునిస్తారు.

వివిధ రకాల మూవ్‌మెంట్స్‌

యుద్ధ విద్యల్లో ప్రత్యర్థుల దాడిని దీటుగా ఎదుర్కోవడంలో అనేక మూవ్‌మెంట్లను నేర్పిస్తారు. ఇందులో ఈగల్‌ మూవ్‌మెంట్‌, టైగర్‌, స్నేక్‌, మంకీ, వంటి ఎనిమిది కటాస్‌ విభాగాలున్నాయి. అలాగే ఆయుధాలైన నాన్‌చాక్‌, తల్వార్‌, స్టిక్స్‌ వంటివి వినియోగించడంలో శిక్షణ ఇస్తున్నారు.

ప్రతిభ ఆధారంగా బెల్టులు

కుంగ్‌ఫూ నేర్చుకుంటున్న విద్యార్ధులకు ఒక్కో దశలో ఒక్కో బెల్డులను అందజేస్తారు. వారి ప్రతిభ ఆధారంగా బెల్టులు ప్రదానం చేసి ప్రోత్సహిస్తారు. ఇందులో ఎల్లో, ఆరేంజ్‌, గ్రీన్‌, బ్లూ, బ్రౌన్‌లో మూడు రకాలు, చివరగా బ్లాక్‌ బెల్టు ఉంటుంది. బ్లాక్‌ బెల్టులు సాధించిన వారు మాస్టర్లుగా తయారై శిక్షణ ఇచ్చే అవకాశం ఉంటుంది.

ఎత్తుకు పైఎత్తు

బొంరాస్‌పేట: పిల్లల మేధోసంపత్తికి ఉపయోగపడే క్రీడల్లో చదరంగం ఒకటి. ప్రత్యర్థి ఎత్తులను చిత్తుచేస్తూ ఎత్తుకు పైఎత్తు వేస్తూ సాగే ఈక్రీడ వినోదంతో పాటు విజ్ఞానాన్ని పెంచుతుంది. ఎండలు మండుతున్న వేళ ఇంట్లోనే కూర్చుని ఆడుకునే వెసులుబాటున్న ఆట చదరంగం. బొంరాస్‌పేటలో చెస్‌ ఆడుతున్న చిన్నారులు యశ్వంత్‌, దైవిక్‌, రేవంత్‌, మన్విత్‌ను సాక్షి కెమెరా క్లిక్‌మనిపించింది.

సందడే.. సందడి!

తాండూరు టౌన్‌: సెలవుల వేళ పట్టణంలోని చిన్నారులు సమ్మర్‌ క్యాంపుల వైపు మొగ్గు చూపుతున్నారు. సెయింట్‌ మార్క్స్‌ పాఠశాల ఆవరణలో సహారా క్రికెట్‌ అకాడమీ కోచ్‌ జగన్నాథ్‌రెడ్డి, సతీష్‌, శరత్‌సింగ్‌ క్రికెట్‌ కోచింగ్‌ ఇస్తున్నారు. స్థానిక శివం గ్రామర్‌ స్కూల్‌ మైదానంలో మాస్టర్‌ మనోహర్‌, కుషాల్‌ ఆధ్వర్యంలో బాలబాలికలకు తైక్వాండో నేర్పిస్తున్నారు. తులసీ గార్డెన్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఎస్‌ఎస్‌ డ్యాన్స్‌ స్టూడియో ఆధ్వర్యంలో మాస్టర్లు రమేష్‌, హన్మంతు చిన్నారుల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ఆయా శిబిరాలు విద్యార్థులతో సందడిగా కనిపిస్తున్నాయి.

హైస్కూల్‌లో సమ్మర్‌ క్యాంప్‌

బడంగ్‌పేట్‌: సమ్మర్‌ క్యాంప్‌ను సద్వినియోగం చేసుకోవాలని బడంగ్‌పేట్‌ సర్కిల్‌– 16 డీసీ సమ్మయ్య విద్యార్థులకు సూచించారు. స్థానిక పీఎంశ్రీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన వేసవి శిబిరాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థులు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ క్యాంప్‌లో కరాటే, యోగా, మ్యాఽథ్స్‌, ఫిజిక్స్‌ చిట్కాలు, డ్యాన్స్‌, ఆర్ట్‌ అండ్‌ క్రాప్ట్‌, ధ్యానం తదితర అంశాలపై శిక్షణ ఇస్తారని తెలిపారు. టెన్త్‌లో ఫెయిలైన వారికి సంబంధిత సబ్జెక్టులు బోధిస్తారని స్పష్టంచేశారు. శిబిరానికి వచ్చే వారికి స్నాక్స్‌, భోజన సదుపాయం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ కృష్ణ, హెచ్‌ఎం సుజాత, మాజీ కార్పొరేటర్‌ పెద్దబావి సుదర్శన్‌రెడ్డి, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్‌ దేవి, ఉపాధ్యాయులు స్వామి, ప్రతాప్‌రెడ్డి, రాజశేఖర్‌, సురేందర్‌రెడ్డి, పరమేష, సంతోష, వనజ తదితరులు ఉన్నారు.

ఆత్మరక్షణకు..

ఆత్మరక్షణకు యుద్ధ ఎంతో ఉపయోగపడతాయి. విద్యార్ధులకు చదువు ఎంత ముఖ్యమో కళలు కూడా అంతే ప్రధానం. వేసవి సెలవుల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. శిక్షణ పూర్తి చేసిన విద్యార్ధులకు పరీక్షలు నిర్వహించి బెల్టులు అందజేస్తున్నాం.

– ఎత్తిన చెన్నయ్య, కరాటే మాస్టర్‌, షాద్‌నగర్‌

Advertisement
 
Advertisement
Advertisement