కేశంపేట: ప్రభుత్వం ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఎంఈఓ చంద్రశేఖర్ అన్నారు. కొత్తపేట పీఎంశ్రీ పాఠశాల అవరణలో సోమవారం క్యాంప్‌ను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. విద్యాభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని తెలిపారు. అనంతరం పాఠశాల చైర్మన్లతో కలిసి హైదరాబాద్‌లో నిర్వహించిన విద్యావారోత్సవాల సభకు తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీడీఓ రవిచంద్రకుమార్‌రెడ్డి, ఎంపీఓ కిష్టయ్య, ఏపీఓ అజీజ్, సీఆర్పీలు పాల్గొన్నారు.
ఆగి ఉన్న కారును ఢీకొట్టి..
మరోకారు బోల్తా: ఒకరికి గాయాలు
మొయినాబాద్: అతివేగంతో వచ్చిన ఓ కారు ఆగి ఉన్న కారును వెనుక నుంచి ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన మున్సిపల్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అజీజ్‌నగర్ రెవెన్యూలో ఉన్న అయానా కన్వెన్షన్ హాల్లో సోమవారం సాయంత్రం జరిగిన ఓ ఫంక్షన్‌కు నగరానికి చెందిన ఓ కుటుంబ సభ్యులు కారు (ఏపీ 39 జీపీ 0045)లో వచ్చారు. కుటుంబ సభ్యులంతా కారు దిగి ఫంక్షన్‌కు వెళ్లారు. అదే కుటుంబానికి చెందిన ఓ బాలుడు సరదాగా కారు తీసుకుని బయటకు వెళ్లాడు. అతివేగంతో కారు నడుపుతూ రోడ్డుపై ఉన్న మట్టికుప్పను తప్పించబోయి రోడ్డు పక్కన ఆగి ఉన్న కారు (ఏపీ 13 ఎల్ 6196)ను ఢీకొట్టడంతో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆగి ఉన్న కారు డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. రెండు కార్లు బాగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదానికి సంబంధించి ఎలాంటి ఫిర్యాదు అందలేదని మొయినాబాద్ ఇన్‌స్పెక్టర్ మల్లికార్జున్‌రెడ్డి తెలిపారు.
పరిగి: ఆర్టీసీ డ్రైవర్‌పై దంపతులు దాడికి పాల్పడిన ఘటన పరిగి బస్టాండ్‌లో సోమ వారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారం.. కాండ్లాపూర్‌కు చెందిన నర్సింలు పరిగి ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. సోమవారం ఉదయం 11 గంటల సమయంలో ఆయన నడుపుతున్న బస్సు హైదరాబాద్ నుంచి పరిగి బస్టాండ్‌కు చేరుకుని ప్రయాణికులను దింపి డిపోనకు వెళ్తోంది. ఈ క్రమంలో గడిసింగాపూర్‌కు చెందిన దంపతులు నస్కంటి కుమార్, స్వాతి బస్ ఎక్కడికి వెళ్తుందని డ్రైవర్‌ను అడిగారు. డిపోనకు వెళ్తుందని చెప్పినప్పటికీ వినకుండా బస్సులో ఎక్కారు. దీంతో డ్రైవర్, దంపతుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో కోపోద్రిక్తులైన దంపతులు డ్రైవర్‌ను అసభ్య పదజాలంతో దూషిస్తూ విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో డ్రైవర్ గాయపడడంతో గమనిచిన సిబ్బంది వెంటనే ఆస్పత్రికి తరలించారు. దాడికి పాల్పడిన దంపతులపై డ్రైవర్ నర్సింలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ రిచ్‌కిడ్ ట్రాప్ కేసులో ప్రధాన నిందితుడు చంద్రశేఖర్ ఆజాద్ అలియాస్ అర్జున్ స్నేహితుడు జే జితేందర్ అలియాస్ జితిన్ (22)పై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో పోక్సో యాక్ట్ కింద కేసు నమోదైంది. పోక్సో యాక్ట్ కింద ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న చంద్రశేఖర్ ఆజాద్‌ను సంపన్న యువతులను ట్రాప్ చేయడంలో ప్రేరేపించినందుకు 10 రోజుల క్రితం జితేందర్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు కూడా చేశారు. అనంతరం స్టేషన్ బెయిల్‌పై బయటకు వచ్చాడు.అయితే ఆ తరువాత కూడా జితేందర్ తాను ట్రాప్ చేసి ప్రేమించిన మైనర్ బాలిక (17)కు సంబంధించిన వ్యక్తిగత ఫోటోలు వీడియోలను ఇన్‌స్ట్రాగామ్‌తో పాటు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తన ప్రతిష్టతకు భంగం కలిగించడమే కాకుండా ప్రేమ పేరుతో తనతో తిరిగి శారీరిక వాంఛలు తీర్చుకుని లక్షలాది రూపాయలు వసూలు చేసిన నిందితుడు జితేందర్‌పై చర్యలు తీసుకోవాలంటూ బాధితురాలు తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తామిద్దరం కలిగి ఉన్నప్పటి ఫోటోలను సోషల్ మీడియాలోనూ, తన స్నేహితులకు పోస్ట్ చేయడమే కాకుండా స్టేటస్‌లో కూడా పెట్టుకున్నారని, దురుద్దేశపూర్వకంగా తన ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నాడని, తనను బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని బాధిత మైనర్ బాలిక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు నిందితుడిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


