మామిడి.. దోపిడీ! | - | Sakshi
Sakshi News home page

మామిడి.. దోపిడీ!

May 12 2026 6:18 AM | Updated on May 12 2026 6:18 AM

టన్నుకు పది కిలోల చొప్పున తరుగు సిండికేట్‌గా మారిన కమీషన్‌ ఏజెంట్లు వారు నిర్ణయించిందే ధర బాటసింగారం మార్కెట్లో తతంగం పట్టించుకోని మార్కెటింగ్‌శాఖఅధికారులు

సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఆరుగాలం శ్రమించి పంట పండించిన మామిడి రైతుకు మార్కెట్లో ఆశించిన ‘మద్దతు’ లభించడం లేదు. వ్యాపారులు, కమీషన్‌ ఏజెంట్లు, మార్కెటింగ్‌ అధికారులు కుమ్మక్కై నిలువు దోపిడీకి గురి చేస్తున్నారు. బోర్డుపై ఉన్న ప్రభుత్వ మద్దతు ధరలకు.. క్షేత్రస్థాయిలో దక్కుతున్న ధరకు ఏమాత్రం పొంతన ఉండటం లేదు. మామిడికాయ సైజు, రకాన్ని బట్టి ధరలు నిర్ణయించాల్సింది పోయి సిండికేట్‌గా మారి డిసైడ్‌ చేస్తున్నారు. విధిలేని పరిస్థితుల్లో రైతులు వారు చెప్పిన రేటుకే విక్రయించి వెనుదిరగాల్సి వస్తోంది. టన్నుకు పది నుంచి ఇరవై కిలోల వరకు తరుగు పేరుతో మోసం చేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో కేజీ ధర రూ.100పైగా పలుకుతుంటే.. ఈ హోల్‌సేల్‌ మార్కెట్లో మాత్రం రూ.40కి మించడం లేదు.

ఢిల్లీ, మధ్యప్రదేశ్‌,

పశ్చిమబెంగాల్‌కు ఎగుమతి

బాటసింగారం పండ్ల మార్కెట్‌కు 2004లో మార్కెట్‌కు 1,11,107 టన్నుల మామిడి రాగా వీటి ద్వారా రూ.2.70 కోట్ల ఆదాయం సమకూరింది. 2025లో 1,43,979 టన్నులు రాగా, వీటి ద్వారా రూ.3 కోట్ల రాబడి వచ్చింది. ఈ ఏడాది ఇప్పటి వ రకు 70 వేల టన్నుల మామిడి వచ్చింది. ప్రస్తు తం మార్కెట్‌లో 25 నుంచి 30 మంది కమీషన్‌ ఏజెంట్లు ఉన్నారు. వీరిలో 15 నుంచి 20 మంది ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. మార్కె ట్‌కు వచ్చిన పంటలో 70 శాతం మామిడిని ఢిల్లీ, మధ్య ప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌ తదితర రాష్ట్రాలకు ఎగు మతి అవుతోంది. కేవలం 30 శాతం పంట మాత్ర మే స్థానిక అవసరాలకు వినియోగం అవుతోంది.

మౌలిక సదుపాయాలు కరువే..

బాటసింగారం పండ్ల మార్కెట్‌కు తెలంగాణ నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్‌ జిల్లాల నుంచి రోజుకు కనీసం 1000 నుంచి 1,200 వాహనాల్లో మామిడి వస్తోంది. రైతులతో పాటు వాహనదారులు, కూలీలు, వ్యాపారులతో మార్కెట్‌ కిక్కిరిసిపోతోంది. పండ్ల అమ్మకాల ద్వారా ఏటా రూ.మూడు కోట్ల ఆదాయాన్ని సమకూర్చి పెడుతున్న మార్కెట్‌లో కనీస మౌలిక సదుపాయాలు కరువయ్యాయి. తాగేందుకు మంచినీరు, సేద తీరేందుకు అవసరమైన విశ్రాంతి గదులు లేకపోవడం ఇబ్బందిగా మారింది. ఒంటికి, రెంటికి బహిరంగ ప్రదేశాల్లోకే పరుగులు తీయాల్సి వస్తోంది. ఆశించిన స్థాయిలో షెడ్లు లేకపోవడంతో రైతులు తమ పంటను ఆరుబయట ఎండలో కుప్పలుగా పోసి అమ్ముకోవాల్సి వస్తోంది.సాయంత్రం ఈదురు గాలితో కూడిన వర్షాలకు ఎగువ నుంచి వచ్చేవరదతో బొప్పాయి,ఖర్బూజా, వాటమిలాన్‌, పైనాపిల్‌ వంటి పండ్లు దెబ్బతింటున్నాయి.

రైతుకు కరువైన ‘మద్దతు’

నాణ్యతను బట్టి ధర

కాయ రకం, నాణ్యతను బట్టి ధరలు నిర్ణయిస్తున్నాం. ఏదైనా మంగుమచ్చ, గ్రేడింగ్‌ చేయకుండా మిక్సింగ్‌తో వచ్చే కాయ తూకంలో రైతుల అంగీకారంతోనే కొంత తరుగు తీస్తుండొచ్చు. నాణ్యమైన కాయలో ఎలాంటి తరుగు ఉండదు. వ్యాపారులు, కమీషన్‌ ఏజెంట్లు సిండికేట్‌ అయ్యారనే ఆరోపణల్లో వాస్తవం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లభించని మద్దతు ధర ఇక్కడే లభిస్తోంది. అందుకే రైతులు ఈ మార్కెట్‌కు ఎక్కువగా వస్తుంటారు. మద్దతు ధర విషయంలో ఇప్పటి వరకు ఒక్క ఫిర్యాదు కూడా అందలేదు. రైతులకు నష్టం వాటిళ్లకుండా చూస్తున్నాం.

– శ్రీనివాస్‌,

మార్కెట్‌ కమిటీ కార్యదర్శి, గడ్డిఅన్నారం

సిండికేటై ధరలు తగ్గిస్తున్నారు

కొల్లాపూర్‌ నుంచి మామిడిలోడు తీసుకొచ్చాను. టన్నుకు వంద కేజీల వరకు తరుగు తీస్తున్నారు. వ్యాపారులు, కమీషన్‌ ఏజెంట్లు సిండికేట్‌గా మారి ధరలు తగ్గిస్తున్నారు. రైతులకు తీరని అన్యాయం చేస్తున్నారు. షెడ్లు లేకపోవడంతో కాయలను ఓపెన్‌ప్లేసులో పోయాల్సి రావడంతో కాయలు పాడైపోతున్నాయి. మార్కెట్‌లో కనీస సదుపాయాలు కూడా లేవు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు రోజంతా ఎండలోనే నిలబడాల్సి వస్తోంది. తాగేందుకు కనీసం మంచినీటి సదుపాయం కూడా లేదు. దాహమేస్తే బాటిళ్లను కొనుగోలు చేయాల్సి వస్తోంది.

– రాములు,

మామిడి రైతు

Advertisement
 
Advertisement
Advertisement