షెడ్లతో మొదలు.. బిల్డింగ్‌లతో పూర్తి! | - | Sakshi
Sakshi News home page

షెడ్లతో మొదలు.. బిల్డింగ్‌లతో పూర్తి!

May 12 2026 6:18 AM | Updated on May 12 2026 6:18 AM

చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు ప్రభుత్వ భూమిని కాపాడాలంటున్న స్థానికులు

శంకర్‌పల్లి: ప్రభుత్వం పేద ప్రజల కోసం కేటాయించిన ప్లాట్లు మెల్లమెల్లగా అక్రమార్కులు చేతుల్లోకి వెళ్తున్నాయి. ఎలాంటి అనుమతులు లేనప్పటికీ యథేచ్ఛగా నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ తతంగం ఏళ్ల నుంచి కొనసాగుతున్నా శంకర్‌పల్లి రెవెన్యూ, నార్సింగి గ్రేటర్‌ సర్కిల్‌ అధికారులు పట్టవన్నట్లు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. పెద్ద ఎత్తున ముడుపులు తీసుకొని కబ్జాదారులకు కొమ్ముకాస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.

పేదల కోసం భూ కేటాయింపు

2005లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే ఉద్దేశంతో జన్వాడ రెవెన్యూ గ్రామంలోని మిర్జాగూడలో (ప్రస్తుతం ఈ రెండు గ్రామాలు గ్రేటర్‌లో విలీనమై నార్సింగి సర్కిల్‌లో ఉన్నాయి.) సర్వే నంబర్‌ 192లో 102 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించారు. దానికి ఇంద్రారెడ్డి నగర్‌గా నామకరణం చేశారు. ఒక్కొక్కరికి 60గజాల చొప్పున ప్లాట్లను ఇచ్చారు. దీనిలో జన్వాడ, మిర్జాగూడ గ్రామస్తులకు 1,525 ప్లాట్లతోపాటు మణికొండలో గుడిసెలు వేసుకున్న వారిని అక్కడ నుంచి ఖాళీ చేయించి ఇక్కడ పునరావాసం కింద 494 ప్లాట్లు కేటాయించారు. మొత్తంగా 2019 ప్లాట్లు కేటాయించి అధికారికంగా లే అవుట్‌ చేశారు.

రింగు రోడ్డుతో ప్లాట్లకు రెక్కలు

ప్రభుత్వం చేసిన లే అవుట్‌కి అనుకొని రీజినల్‌రింగు రోడ్డు వెళ్లడంతో ఇంద్రారెడ్డి నగర్‌లోని ప్లాట్లకు భారీ డిమాండ్‌ వచ్చింది. దీంతో అక్రమార్కులు అధికారులతో చేతులు కలిపి లే అవుట్‌కి సంబంధం లేకుండా ఉన్న ఖాళీ స్థలాలే లక్ష్యంగా ప్లాట్లు చేశారు. వాటికి ధృవీకరణ పత్రాలు సైతం సృష్టించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పుట్టగొడుగుల్లా నిర్మాణాలు

ఇంద్రారెడ్డి నగర్‌లో ప్రభుత్వం కేటాయించిన ప్లాట్లు 2019 కాగా.. ప్రస్తుతం అక్కడ రెట్టింపు సంఖ్యలో ఇళ్లు ఉండడం గమనార్హం. లే అవుట్‌ చేసిన సమయంలో ప్రజా అవసరాల నిమిత్తం కేటాయించిన భూమిని కబ్జాదారులు కబ్జా చేయడం ప్రారంభించారు. ముందు చిన్నచిన్న రేకుల షెడ్లు వేసి, తర్వాత రెండేళ్లు, మూడేళ్లకు వాటిని కూల్చి భవనాలను నిర్మించుకుంటున్నారు. దీనికి కొంతమంది అధికారులు ఇంటి నంబర్లు ఇవ్వడం, వారికి మద్దతు తెలపడం గమనార్హం.

తహసీల్దార్‌, ఆర్డీఓకు ఫిర్యాదులు

ఇంద్రారెడ్డి నగర్‌లో అక్రమ కట్టడాలపై మిర్జాగూడ, జన్వాడలకు చెందిన పంతం మల్లేశ్‌, సంజీవ, వెంకటేశ్‌, భిక్షపతితో పాటు పలువురు గ్రామస్తులు ఇటీవల శంకర్‌పల్లి తహసీల్దార్‌ సురేందర్‌, చేవెళ్ల ఆర్డీఓ పార్థసింహారెడ్డికి ఫిర్యాదు చేశారు. అక్రమార్కులు బిల్డింగ్‌లు కట్టి, అమాయక ప్రజలను మోసం చేస్తున్నారని, అదే విధంగా ప్లాట్లు, ఇళ్లు తమవే అని చెప్పి దౌర్జన్యంగా అమ్ముకుంటూ డబ్బులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రభుత్వ భూమిని కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.

యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు

చర్యలు తీసుకుంటాం

ఇంద్రారెడ్డి నగర్‌లో అక్రమ నిర్మాణాలు, భూ కబ్జాలకు సంబంధించిన విషయమై ఇప్పటికే పలువురు ఫిర్యాదు చేశారు. అధికారులను పంపి, దర్యాప్తు చేయిస్తాం. ఆక్రమణలు నిజమని తెలితే, వాటిని కూల్చివేసి, చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.

– సురేందర్‌, తహసీల్దార్‌, శంకర్‌పల్లి

Advertisement
 
Advertisement
Advertisement