నిషిద్ధ భూముల్లో నిర్మాణాలు | - | Sakshi
Sakshi News home page

నిషిద్ధ భూముల్లో నిర్మాణాలు

May 11 2026 9:55 AM | Updated on May 11 2026 9:55 AM

చర్యలు తప్పవు

తుర్కయంజాల్‌: ఆదిబట్ల సర్కిల్‌ పరిధిలోని అక్రమ నిర్మాణాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌, హార్డ్‌వేర్‌ పార్కు భూముల్లో అనుమతులు లేకుండా పదుల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నా టౌన్‌ప్లానింగ్‌ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ భూములను 2004లో అప్పటి ప్రభుత్వం హార్డ్‌వేర్‌ పార్కుకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. అప్పటికే పలు సర్వే నంబర్లలోని భూమిని పంచాయతీ లే అవుట్‌గా మార్చారు. అయినప్పటికీ ప్రభుత్వం భూములను తీసుకుంటున్నట్లు ప్రకటించి ప్రొహిబిటెడ్‌ లిస్ట్‌లో చేర్చడంతో నిర్మాణాల ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది.

రిజిస్ట్రేషన్లు నిలిపేసినా..

అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం తుర్కయంజాల్‌ రెవె న్యూ పరిధిలోని సర్వే నంబర్‌లు 495, 500, 502, 505, 506, 508,509, 515, 517, 518, 519, 523, 526, 527, 528, 530, 533, 536, 538, 542, 543, 544, 546, 547, 550, 554, 556, 653, 656, 657, 658, 659, 660, 661, 662 లోని భూమి అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌తో పాటు, హార్డ్‌వేర్‌ పార్క్‌కు కేటాయించారు. వీటి మొత్తం విస్తీర్ణం సుమారు 323 ఎకరాలు. గడిచిన కొన్నేళ్లుగా ఈ సర్వే నెంబర్‌లు ప్రొహిబిటెడ్‌ లిస్ట్‌లో ఉన్నప్పటికీ యథేచ్చగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగించారు. వీటి పరిధిలోని ప్లాట్ల రిజిస్ట్రేషన్లపై పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. అదనంగా డబ్బులు తీసు కుంటూ రిజిస్ట్రేషన్లు చేశారు అనే గుసగుసలు వినిపించేవి. ఈ క్రమంలో ఇటీవల ఈ సర్వే నంబర్‌ల పరిధిలోని ప్లాట్ల రిజిస్ట్రేషన్‌లను సబ్‌ రిజిస్ట్రార్‌ నిలిపివేశారు. అయినప్పటికీ ఇళ్ల నిర్మాణాల ప్రక్రియ మాత్రం ఆగడం లేదు. ఇటీవల కొందరు అధికారులు, ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది అండదండలతో ఎలాంటి అనుమతులు లేకుండా యథేచ్చగా నిర్మాణాలను చేపడుతున్నారు. పదికి పైగా రిసార్ట్‌లు, క్రికెట్‌ గ్రౌండ్‌లను నిర్మించినా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. వీటిని ప్రారంభ దశలోనే అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో వీటికి అడ్డుకట్ట వేసే వారే కరువయ్యారు. కేవలం నోటీసులను జారీ చేసి చేతులు దులుపుకొంటున్నారు. ప్రభుత్వం టీజీఐఐసీకి కేటాయించిన ఈ భూముల్లో నిర్మాణాలు చేపడుతున్నా చర్యలు తీసుకోకపోవడంతో అధికారుల తీరుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

హార్డ్‌వేర్‌ పార్క్‌, సీలింగ్‌ భూముల్లో చేపడుతున్న నిర్మాణాలు

హార్డ్‌వేర్‌ పార్క్‌, సీలింగ్‌ భూముల్లో రిసార్ట్‌లు, క్రికెట్‌ గ్రౌండ్‌లు

పట్టించుకోని టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు

నోటీసుల జారీతో చేతులు దులుపుకొంటున్న వైనం

హార్డ్‌వేర్‌ పార్కు, అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌ భూముల్లో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టొద్దు. నిబంధనలను అతిక్రమించి ఎవరైనా చేపడితే చట్టరీత్యా చర్యలు తప్పవు. ఇప్పటికే పలు నిర్మాణాలకు నోటీసులు జారీ చేశాం. విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం.

– కిరణ్‌, టీపీఓ, ఆదిబట్ల సర్కిల్‌

Advertisement
 
Advertisement
Advertisement