టాస్క్ సీఈఓ సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి
ఆమనగల్లు: ప్రతీ పల్లె, ప్రతి తండాకు సురక్షిత తాగునీరు అందించడమే ఐక్యత ఫౌండేషన్ లక్ష్యమని ఫౌండేషన్ చైర్మన్, టాస్క్ సీఈఓ సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి అన్నారు. ఆమనగల్లు, తలకొండపల్లి, వెల్దండ మండలాల్లో శనివారం సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆమనగల్లులో నిర్వహిస్తున్న ఉచిత పోలీసు శిక్షణ కేంద్రంలో అభ్యర్థులకు స్టడీ మెటీరియల్‌ను అందజేశారు. అనంతరం పోచమ్మగడ్డ తండాలో రూ.1.50 లక్షలతో ఏర్పాటు చేసిన వాటర్‌ప్లాంట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరి ఆరోగ్యం కోసం సురక్షిత తాగునీరు ఎంతో అవసరమన్నారు. పల్లెలు, తండాల్లో సురక్షిత తాగునీరు అందించాలనే లక్ష్యంగా ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాటర్‌ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు మహిపాల్, గోపాల్, గన్యానాయక్, రమేశ్‌నాయక్, నాయకులు పంతులునాయక్, శ్రీరామ్, హనుమంతు, వెంకట్‌నాయక్, సేవ్యానాయక్, జైపాల్, తిరుపతి, ఐక్యత ఫౌండేషన్ సభ్యులు రచ్చ శ్రీరాములు, జైపాల్‌రెడ్డి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
వ్యక్తికి తీవ్ర గాయాలు
యాలాల: వేగంగా, అజాగ్రత్తగా వెళుతున్న ఓ ఇసుక ట్రాక్టర్ బైక్‌ను ఢీకొంది. ఈ ఘటన మండలంలోని దౌలాపూర్ సమీపంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ విఠల్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. తాండూరు పట్టణానికి చెందిన మహ్మద్ మోయిజ్ పని నిమిత్తం దౌల్తాబాద్ మండలం హుస్నాబాద్‌కు వెళ్లి మధ్యాహ్నం తన బైక్‌పై తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో దౌలాపూర్ సమీపంలోకి రాగానే అగ్గనూరు గ్రామానికి చెందిన రవిగౌడ్‌కు చెందిన ట్రాక్టర్ ఇసుక లోడ్‌తో వేగంగా వెళ్తుండగా ముందు టైరు పేలింది. ఈ క్రమంలో ఎదురుగా బైక్‌పై వస్తున్న మోయిజ్‌ను ట్రాక్టర్ ఢీకొనడంతో ఎడమకాలికి, చేతికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రుడిని తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం మోయిజ్‌ను నగరానికి రిఫర్ చేశారు. క్షతగాత్రుడి కొడుకు ఫాజిల్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
16, 18న ఇంటర్‌లో చేరేందుకు కౌన్సెలింగ్
కొడంగల్ రూరల్: గిరిజన గురుకుల విద్యాలయాల్లో ఇంటర్‌లో చేరేందుకు మిగిలిన సీట్ల భర్తీ కోసం ఈ నెల 16న బాలురకు, 18న బాలికలకు కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్ కె.నాగార్జునరావు ఆదివారం ఓ ప్రకనటలో తెలిపారు. ఆసక్తి, అర్హత కలిగిన విద్యార్థులు సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కొడకంచి రోడ్‌లోని గిరిజన గురుకుల బాలుర జూనియర్ కళాశాలలో ఉదయం 10గంటల నుంచి కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని తెలిపారు. 10వ తరగతి మార్కుల మెమో, బదిలీ ధ్రువపత్రం, స్టడీ, కండక్ట్ సర్టిఫికెట్, కుల ధ్రువీకరణ పత్రం, 2026–27 ఆదాయ ధ్రువీకరణ పత్రంఆధార్ జిరాక్స్, స్పోర్ట్స్, పీహెచ్‌సీ ధ్రువీకరణ పత్రం, మూడు కలర్ ఫొటోలు, రెండు జతల జిరాక్స్ కాపీలతో హాజరుకావాలన్నారు.
క్యాష్ ఇన్‌చార్జ్ కాజేసినట్లు కేసు నమోదు
శ్రీనగర్ కాలనీ: యూసుఫ్‌గూడ ఎస్‌బీఐలో రూ.23 లక్షలు మాయమయ్యాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి వివరాలు వెల్లడించారు. యూసుఫ్‌గూడ ఎస్‌బీఐలో క్యాష్ ఇన్‌చార్జ్‌గా అబ్బిరెడ్డి యాదగిరిరెడ్డి పని చేస్తున్నారు. గతేడాది అక్టోబర్ 7న యూసుఫ్‌గూడ బ్రాంచిలోని పాత ఏటీఎం స్థానంలో ఎస్‌పీఆర్ మిషన్‌ను ఏర్పాటు చేయాలని బ్యాంకు నిర్ణయించింది. రికార్డులో రూ 27.5 లక్షలు ఎంట్రీ చేశారు. బ్యాంకు ఏటీఎం నుంచి డబ్బులు తీయ కుండానే తీసినట్లుగా బోగస్ ఎంట్రీలు సృష్టించారు. మరుసటి రోజు యాదగిరిరెడ్డి ఇతర సిబ్బందితో కలిసి ఏటీఎంలోని డబ్బు పెట్టెలను బ్యాంకు స్ట్రాంగ్ రూంకు తరలించారు. అధికారులు డబ్బు పెట్టెలను లెక్కించి రూ.23 లక్షలు మాయమైనట్లు గుర్తించారు. సీసీ పుటేజీలు పరిశీలించి యాదగిరిరెడ్డి డబ్బును కాజేసినట్లు బ్యాంకు అధికారులు నిర్ధారించారు. ఈ మేరకు ఎస్‌బీఐ చీఫ్ మేనేజర్ కిరణ్‌కుమార్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


