కొనుగోలు కేంద్రాల వద్ద ఇబ్బందులు | - | Sakshi
Sakshi News home page

కొనుగోలు కేంద్రాల వద్ద ఇబ్బందులు

May 11 2026 9:55 AM | Updated on May 11 2026 9:55 AM

పట్టించుకోని నిర్వాహకులు

సీపీఎం జిల్లా కార్యదర్శి యాదయ్య

ఇబ్రహీంపట్నం: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు గోసపడుతున్నా అధికార యంత్రాంగం పట్టించుకోవడంలేదని సీపీఎం జిల్లా కార్యదర్శి పి.యాదయ్య ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన దండుమైలారంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. పంటను విక్రయించుకునేందుకు వచ్చిన రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. తరుగు పేరుతో క్వింటాల్‌కు ఐదు కేజీల కోత పెడుతున్నారని, పడాల అద్దె, హమాలీ చార్జీల భారం రైతులపైనే పడుతున్నాయని, ధాన్యాన్ని తూర్పార బట్టి శుభ్రం చేసే ఎనిమిది మిషన్లలో కేవలం మూడు మాత్రమే పనిచేస్తున్నాయని, వాటికి సంబంధించిన వైర్లను రైతులే తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద గత ప్రభుత్వం అనుసరించిన విధానాలనే కాంగ్రెస్‌ ప్రభుత్వం అవలంబిస్తోందని విమర్శించారు. కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యం భాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. రైస్‌ మిల్లర్లకు, రైతులకు మధ్యవర్తిగా ప్రభుత్వం మారి వ్యాపారం చేస్తుందని ఆరోపించారు. కోతలు విధించకుండా ధాన్యం కొనుగోలు చేసి, కనీస సౌకర్యాలను కొనుగోలు కేంద్రాల వద్ద కల్పించాలని డిమాండ్‌ చేశారు.

నేడు కలెక్టరేట్‌ ఎదుట ధర్నా

ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద జరుగుతున్న అవకతవకలకు నిరసనగా కలెక్టరేట్‌ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా చేయనున్నట్లు సీపీఎం కార్యదర్శి యాదయ్య తెలిపారు. రైతులంతా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకలు సామెల్‌, బుగ్గరాములు, ముసలయ్య, జగన్‌, జంగయ్య, లింగస్వామి, యాదగిరి, వెంకటేశ్‌, రమేష్‌, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement