ప్రాణం తీసిన వ్యాపార వివాదాలు | - | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన వ్యాపార వివాదాలు

May 11 2026 9:49 AM | Updated on May 11 2026 9:49 AM

ప్రాణం తీసిన వ్యాపార వివాదాలు రోడ్డు దాటుతుండగా.. దారి దోపిడీ కేసులో నిందితులకు రిమాండ్‌

పహాడీషరీఫ్‌: వ్యాపార లావాదేవీల విషయంలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన బాలాపూర్‌ పోలీస్‌స్టేషన్‌న్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ఆదిత్య పాండ్యే (24) వాహనాల రికవరీ ఏజెంట్‌గా పని చేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన మున్నా అదే వ్యాపారం సాగిస్తున్నాడు. వ్యాపార విషయంలో ఇద్దరి మధ్య వివాదాలు నెలకొన్నాయి. శనివారం రాత్రి మాట్లాదామంటూ మున్నా మరో ముగ్గురు స్నేహితులతో కలిసి ఉస్మాన్‌నగర్‌కు రప్పించి ఇంట్లో కర్రలు, రాళ్లతో దారుణంగా హత్య చేశారు. సమాచారం అందుకున్న ఇన్‌స్పెక్టర్‌ సుధాకర్‌ ఘటనా స్థలానికి చేరుకొని పంచనామా అనంతరం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. మృతుడి సోదరుడు సౌరబ్‌ పాండ్యే ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

బైకు ఢీకొని వృద్ధురాలి మృతి

హయత్‌నగర్‌: రోడ్డు దాటుతున్న ఓ వృద్ధురాలిని వేగంగా వచ్చిన బైకు ఢీ కొట్టడంతో తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది. బైకు నడుపుతున్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన హయత్‌నగర్‌ పోలీస్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారం గ్రామానికి చెందిన బీర్ల జంగయ్య భార్య లక్ష్మమ్మ (80) తొర్రూర్‌ గ్రామంలో జరుగుతున్న బీరప్ప పండుగకు బంధువుల ఇంటికి వచ్చింది. రాత్రి 8 గంటల సమయంలో రోడ్డు దాటుతుండగా మునుగనూరు వైపు నుంచి వేగంగా వచ్చిన బైకు (టీఎస్‌ 07 జీఎఫ్‌0071) లక్ష్మమ్మను ఢీ కొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. బైకు నడుపుతున్న పవన్‌కు గాయాలయ్యాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

శంషాబాద్‌ రూరల్‌: ఆటో డ్రైవర్‌ తన ఆటోలో ప్రయాణిస్తున్న వారిని స్నేహితులతో కలిసి బెదిరించి నగలు, నగదు దోచుకున్న ఘటనలో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. బీహార్‌ రాష్ట్రానికి చెందిన ప్రిన్సికుమార్‌ కొత్తూరులోని ఓ పరిశ్రమలో పనిచేస్తూ అక్కడే ఉంటున్నాడు. ఇతడి స్నేహితులు అభిషేక్‌కుమార్‌, రోషన్‌కుమార్‌ హైదరాబాద్‌ను చూసేందుకు ఈ నెల 7వ తేదీన సొంతూరు నుంచి చెర్లపల్లికి వచ్చారు. అదేరోజు రాత్రి వీరిని తీసుకుని ఆటోలో కొత్తూరు వస్తున్నాడు. ఆటో డ్రైవర్‌ అబ్దుల్‌ యాషిన్‌ మార్గమధ్యలో ఈ ఆటోలో మరో ముగ్గురిని ఎక్కించుకున్నాడు. ఆటో ఘాంసిమియాగూడ వద్దకు చేరుకోగానే.. ఆటో డ్రైవర్‌తో పాటు మార్గ మధ్యలో ఆటోలో ఎక్కిన వారు ప్రిన్సికుమార్‌, అతడి స్నేహితులను కత్తితో బెదిరించారు. వారి వద్ద ఉన్న రూ.1,800 నగదు, రెండు వెండి గొలుసులు, రెండు ఉంగరాలతో పాటు రెండు మొబైల్‌ ఫోన్లు లాక్కున్నారు. దీంతో పాటు గూగుల్‌పే ద్వారా రూ.5 వేలు ట్రాన్స్‌ఫర్‌ చేయించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేశారు. నిందితులైన ఆటో డ్రైవర్‌తో పాటు చంద్రాయణగుట్ట ప్రాంతానికి చెందిన మహ్మద్‌ మోసిన్‌, అబ్దుల్‌ మోసిన్‌, అతిఫ్‌ఖాన్‌ను అరెస్టు చేసి శనివారం కోర్టులో హాజరుపర్చారు. నిందితులకు కోర్టు రిమాండ్‌ విధించింది. నిందితుల నుంచి నగలు, నగదు, మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆటోను సీజ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement