షాద్‌నగర్: మూడు వారాలుగా డబుల్ బెడ్‌రూం ఇళ్ల వద్ద స్థానికులు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు.. నీరు సమృద్ధిగా ఉన్నా నేరుగా నల్లాలోకి రావడం లేదు. సంపులో ఉన్న నీటిని తోడుకుంటూ జనం అవస్థలు పడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో మున్సిపాలిటీ శివారులో నిరుపేదల కోసం 1,700 డబుల్‌బెడ్‌రూం ఇళ్లను నిర్మించారు. తాగునీటి కోసం కింద పెద్ద సంపులను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా భవనాలపైన ఉండే ట్యాంకులకు సరఫరా అవుతోంది. అయితే భవనాలపై ఉన్న కొన్ని ట్యాంకులు చోరీకి గురికాగా మరికొన్ని పగిలిపోయాయి. కింద ఉండే సంపు నుంచి సరఫరా కావడం లేదు. దీంతో ఇక్కడ నివసించే వారు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. సంపుల నుంచినీటిని తోడుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మిషన్ భగీరథ నీరు పుష్కలంగా ఉన్నా నేరుగా ట్యాంకుల్లోకి వెళ్లకపోవడంతో తిప్పలు తప్పడం లేదు.
కొన్ని రోజులుగా తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నాం. సంపు నుంచి నీటిని తోడుకొని బిందెల ద్వారా తీసుకెళ్తున్నాం. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలి.
– మధు, షాద్‌నగర్


