రిజిస్ట్రేషన్‌.. పరేషాన్‌ | - | Sakshi
Sakshi News home page

రిజిస్ట్రేషన్‌.. పరేషాన్‌

May 9 2026 9:37 AM | Updated on May 9 2026 9:37 AM

‘పట్నం’ కార్యాలయంలో పనిచేయని ఇంటర్‌నెట్‌ మూడు రోజులుగా నిలిచిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ క్రయవిక్రయదారులకు తప్పని ఇబ్బందులు

ఇబ్రహీంపట్నం: సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో మూడు రోజులుగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. బుధవారం నుంచి కార్యాలయానికి వచ్చే ఇంటర్‌నెట్‌ పనిచేయకపోవడంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఆగిపోయింది. ఇబ్రహీంపట్నం సబ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో ఇద్దరు సబ్‌ రిజిస్ట్రార్‌లు పనిచేస్తున్నారు. నిత్యం 60 నుంచి 80 వరకు రిజిస్ట్రేషన్లతోపాటు ఈసీ, సీసీ ప్రతులకు మ్యారేజ్‌ రిజిస్ట్రేషన్లకు కార్యాలయానికి వందలాది మంది వస్తుంటారు. ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన చలాన్లు కట్టి, స్లాట్‌ బుక్‌ చేసుకొని కొనుగోలు, అమ్మకందారులతోపాటు ఇద్దరు సాక్షులు, మధ్యవర్తులు దూర ప్రాంతాల నుంచి కార్యాలయానికి వస్తే ఇంటర్‌నెట్‌ పనిచేయడంలేదని అధికారులు చావు కబురు చల్లగా చెబుతున్నారు. కార్యాలయానికి రెండు ఇంటర్‌నెట్‌ కనెక్షన్లు ఉన్నాయి. బుధవారం వైర్లు తెగిపోయి మొరాయించాయి. దీంతో మూడు రోజులుగా ఇబ్బందులు తప్పడం లేదు. నెట్‌వర్క్‌ సమస్య పరిష్కారానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. వెంటనే సమస్య పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని కార్యాలయానికి వచ్చేవారుకోరుతున్నారు.

నెట్‌వర్క్‌ పనిచేయడం లేదు

ఇంటర్‌నెట్‌ పనిచేయని కా రణంగా మూడు రోజులు గా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోయింది. సంబంధిత సిబ్బందికి సమాచారం ఇచ్చాం. నెట్‌కు సంబంధించిన వైర్లు కట్‌ అయినట్లు చెబుతున్నారు. శనివారంలోపు సమస్య పరిష్కారం అవుతుంది.

– రాకేష్‌, ఇన్‌చార్జి సబ్‌ రిజిస్ట్రార్‌, ఇబ్రహీంపట్నం

చలాన్‌ కట్టి మూడు రోజులైంది

ఇబ్రహీంపట్నంలోని 284 గజాల ప్లాట్‌ రిజిస్ట్రేషన్‌కు బుధవారం రూ.51 వేల చలాన్‌ కట్టాను. మూడు రోజులుగా రిజిస్ట్రేషన్‌ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నా. ఇంటర్‌నెట్‌ పనిచేయడంలేదని చెబుతున్నారు.

– ఆకుల ఆనంద్‌కుమార్‌, ఇబ్రహీంపట్నం

Advertisement
 
Advertisement
Advertisement