షాద్‌నగర్: పాడి రైతులు శాసీ్త్రయ పద్ధతులను పాటించడం ద్వారా పశువుల ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడంతో పాటు పాల దిగుబడిని పెంచి అధిక లాభాలు పొందొచ్చని జిల్లా పశు సంవర్ధకశాఖ అధికారి డాక్టర్ శ్రీనివాస్ అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం ఫరూఖ్‌నగర్ మండలం పీర్లగూడలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత పశువైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు పశువులకు పచ్చిగడ్డి, ఎండుగడ్డి, దాణాను సరైన నిష్పత్తిలో అందించాలని సూచించారు. పాల దిగుబడి పెరగడానికి పశుగ్రాసంలో ఖనిజ లవణాల మిశ్రమాన్ని తప్పనిసరి కలపాలన్నారు. పశువుల ఆరోగ్య స్థితిని ఎప్పటికప్పుడు గమనించాలని, గొంతువాపు, జబ్బవాపు, గాలికుంట వ్యాధుల నివారణకు సకాలంలో టీకాలు వేయించాలన్నారు. క్రమ తప్పకుండా నట్టల నివారణ మందు తాగించాలన్నారు. జిల్లాలోని 30 గ్రామాల్లో పాడి రైతుల కోసం అవగాహన కార్యక్రమాలు, పశువైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, జిల్లా పశుగణాభివృద్ధిశాఖ అధికారి డాక్టర్ అరుణశ్రీ, ఏడీఏ విజయ్‌కుమార్‌రెడ్డి, మండల పశువైద్యాధికారి డాక్టర్ ముక్కంటి రాజ్, సర్పంచ్ షమీమ్ బేగం తదితరులు పాల్గొన్నారు.


