ఇబ్రహీంపట్నం: ఎన్‌ఎంఎంఎస్ (నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టం) యాప్ పనితీరును పరిశీలించేందుకు రాయపోల్ గ్రామ పరిధిలో ఉపాధి కూలీలు పనిచేసే ప్రదేశాన్ని శుక్రవారం అడిషనల్ డీఆర్‌డీఓ సుభాషిణి సందర్శించారు. ముఖకవళికలు గుర్తించే ఈ యాప్ ద్వారా ఉపాధి పనికి వచ్చే కూలీల ఫొటోలు తీసుకుంటారు. పనికి వచ్చిన నాలుగు గంటలకు 40 నుంచి 50 మంది కూలీల మరో గ్రూప్ ఫొటోను తీయాలని తాజాగా ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో సాంకేతికంగా ఏమైనా సమస్యలు తలెత్తుతున్నాయా అనే విషయాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించేందుకు ఆమె ఈ ప్రాంతాన్ని సందర్శించి కూలీలతో మాట్లాడారు. ఫొటోల గుర్తింపులో ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆమె కూలీలను ప్రశ్నించారు. ఫొటోలకే సమయం పడుతోందని, టెక్నికల్ సమస్యలు ఎదురవుతున్నాయని కూలీలు ఆమె దృష్టికి తీసుకొచ్చారు. ఆమె వెంట ఉపాధి హామీ ఏపీఓ చారి, ఫీల్డ్ అసిస్టెంట్లు, మెట్‌లు ఉన్నారు.


