నెట్‌ఇంట్లో కథల పొట్లం! | - | Sakshi
Sakshi News home page

నెట్‌ఇంట్లో కథల పొట్లం!

May 9 2026 9:37 AM | Updated on May 9 2026 9:37 AM

నెట్‌ఇంట్లో కథల పొట్లం! ఉయ్యాల.. జంపాల

కరాటే క్యాంప్‌

నీతి కథలు, మహనీయులు, సాహస వీరుల చరిత్రలు, పాటలు, కవిత్వాలు, పొడుపు కథలు వంటివి చిన్నారులు మేధోవికాసానికి ఎంతగానో దోహదం చేస్తాయి. సంస్కృతి, సంప్రదాయాలు, సమాజం పట్ల అవగాహనను పెంపొందిస్తాయి. గురువులు, పెద్దలపై గౌరవ భావాలను ఇనుమడింపజేస్తాయి. ప్రస్తుత కాలంలో చిన్నారులు సరదాగా, విరివిగా వినియోగిస్తున్న సెల్‌ఫోన్లు, కంప్యూటర్లు, ట్యాబ్‌లు వారి విజ్ఞానాన్ని పెంచేలా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే.

షాద్‌నగర్‌: నేటి తరం చిన్నారులు అన్ని రంగాల్లో వేగంగా దూసుకెళ్తున్నారు. సెల్‌ఫోన్‌, కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌, ట్యాబ్‌లను వినియోగిస్తూ వారికి కావాల్సిన ఆటలు ఆడుతూ, పాటలు వింటూ ఆనందంగా గడుపుతున్నారు. అయితే వారికి ఫోన్లు, కంప్యూటర్లు, ట్యాబ్‌లు అప్పగించి వదిలేయకుండా ఏం చూస్తున్నారు..? ఏం వింటున్నారనే విషయాన్ని తల్లిదండ్రులు గమనిస్తూఉండాలి. విచ్చలవిడిగా సైట్లు తెరవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్నారుల మేధస్సుకు ఉపయోగపడే అంశాలు మాత్రమే వాటిలో ఓపెన్‌ అయ్యేలా చర్యలు తీసుకోవడం మేలు.

చందమామ రావే.. జాబిల్లి రావే

చందమామ కథలకు ఓ ప్రత్యేకత ఉంది. రాత్రి వేళ చిన్నారులు అన్నం తినకుండా మారాం చేస్తే వెంటనే బయటికి తీసుకెళ్లి ఆకాశంలోని చంద్రున్ని చూపిస్తూ.. చందమామ రావే.. జాబిల్లి రావే.. అని పాట పాడుతూ.. తల్లులు తమ పిల్లలకు గోరు ముద్దలు తినిపించేవారు. ఇప్పుడు కూడా ఇలాంటి కథలు పెట్టి సెల్‌ఫోన్‌ చేతికిస్తే కానీ ఏడాది పిల్లాడు సైతం ముద్ద మింగడం లేదు. జానపద పాటలు, సాహిత్యం, హాస్యం వంటి కథలు చందమామ.ఇన్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.

పరమానందయ్య శిష్యుల కథలు

చిన్నారులను అమితంగా ఆకట్టుకునేవి, కడుపుబ్బానవ్వించే కథల్లో పరమానందయ్య శిష్యుల కథలు ప్రధానమైనవి. ఈ కథల్లో జీవిత పాఠాలకు సంబంధించిన అనేక అంశాలు ముడిపడి ఉంటాయి. వీటిని చూడటం, వినడం పిల్లల భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడతాయి. పెదరాసి పెద్దమ్మ కథలు, చిన్నారి చిట్టి కథలు వంటివి ఇంటర్‌నెట్‌లో మంచి పుస్తకం.ఇన్‌లో చూడవచ్చు.

యానిమేషన్‌ చిత్రాలతో..

చిన్నారుల కథలు చదవాలన్నా, వాటివైపు ఆకర్షితులు కావాలన్నా యానిమేషన్‌ చిత్రాలు తప్పనిసరి. ఇవి లేకుండా ఇంటర్‌నెట్‌లో కథలు చూడలేరు. యానిమేషన్‌తో కూడిన అనేక కథలు బాలవినోదం బ్లాగ్‌ స్పాట్‌.ఇన్‌లో ఉన్నాయి.

వీరీవీరీ గుమ్మడి పండు..

పిల్లలతో పాటు పెద్దలను కట్టిపడేసే పంచతంత్ర కథలు, తెలుగు వీడియో కథలు తెలుగు రైమ్స్‌.కామ్‌లో ఉన్నాయి. తెలుగు క్విజ్‌, ఆటల వీడియోలు పిల్లలను ఎంతో ఆకర్షిస్తాయి.వీరీవీరీ గుమ్మడి పండు.. వీరి పేరేమి, దాగుడు మూతల దండాకోర్‌ ఎక్కడి దొంగలు అక్కడ్నే వంటి అనేక రకాల వీడియోలు ఇక్కడ చూడొచ్చు.

సంస్కృతిని తెలియజెప్పేవి..

కథలు చూడటంలో, వినడంలో చిన్నారుల అభిరుచులు వేర్వేరుగా ఉంటాయి. కొందరు పాశ్చాత్యానికి సంబంధించి కథలు వింటే మరికొందరు ప్రాచీన కథలు, ఇతిహాసాలు, కవితలు, పాటలు వినేందుకు ఆసక్తి కనబరుస్తారు. భారతీయ సంస్కతిని ప్రతిబింబించే కవితలు, కథలు, పాటలు అనేక వెబ్‌సైట్‌లో లభిస్తాయి. ఇందులో కథలు.వర్డ్‌ప్రెస్‌.కామ్‌ వెబ్‌ సైట్‌ ఒకటి.

బొంరాస్‌పేట: అమ్మ ఒడిలో అల్లారుముద్దుగా పెరిగే చిన్నారులకు వేసవి వేళ ఉల్లాసం కలిగించేది ఉయ్యాల. ఎన్కేపల్లి యూపీఎస్‌ ఉపాధ్యాయురాలు జ్యోతి పరమేశ్వరి, బాలు దంపతులకు రియాన్షిక, రుద్రాణి అనే ఇద్దరు కూతుళ్లున్నారు. వేసవి సెలవుల్లో బంధువుల ఊరైన చౌడాపూర్‌లోని మామిడితోటలో ఇలా.. తల్లి చీరలను కొమ్మలకు కట్టించుకుని ఊయల ఊగుతూ సరదాగా గడుపుతున్నారు.

చిన్నారులను అలరిస్తున్న ఆటలు, పాటలు

మేధస్సును పెంచే కథలు, మహనీయుల చరిత్రలు

సెల్‌ఫోన్‌, కంప్యూటర్‌లతో గడిపేస్తున్న బాలబాలికలు

మోడల్‌ స్కూల్‌లో సమ్మర్‌ క్యాంప్‌

కందుకూరు: మండలంలోని నేదునూరు పరిధిలోని మోడల్‌ స్కూల్‌లో ఈ నెల 11నుంచి 25వ తేదీ వరకు విద్యార్థులకు సమ్మర్‌ క్యాంపు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్‌ విష్ణుప్రియ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. మండలంలోని 6నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. క్యాంపులో డ్యాన్స్‌, సంగీతం, పాటలు, ఆటలతో పాటు క్రియేటివ్‌ యాక్టివిటీస్‌, చిత్రలేఖనం, అవుట్‌ డోర్‌ గేమ్స్‌, ఇండోర్‌ గేమ్స్‌పై తర్ఫీదు ఇస్తారని తెలిపారు. నిత్యం ఉదయం 8నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తరగతులు కొనసాగుతాయని, ఆసక్తి ఉన్నవారు స్కూల్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు.

పీఎంశ్రీ హైస్కూల్‌లో శిబిరం

బడంగ్‌పేట్‌: సర్కిల్‌లోని బడంగ్‌పేట పీఎంశ్రీ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఈనెల 11 నుంచి సమ్మర్‌ క్యాంప్‌ నిర్వహించనున్నట్లు హెచ్‌ఎం సుజాత తెలిపారు. పదిహేను రోజుల పాటు కొనసాగే శిబిరంలో వ్యక్తిత్వవికాసం, యోగా, ధ్యానం, సంగీతంతో పాటు వివిధ కళలపై శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. 6నుంచి 9వతరగతి చదివే విద్యార్థులను క్యాంప్‌నకు పంపించాలని తల్లిదండ్రులను కోరారు.

అనంతగిరి: వికారాబాద్‌ పట్టణంలోని మేరినాట్స్‌ గ్రౌండ్‌లో కరాటే సమ్మర్‌ క్యాంప్‌ నిర్వహిస్తున్నారు. మాస్టర్‌ జపాన్‌ షోటోకాన్‌ కరాటే డూ అసోసియేషన్‌ ఇండియా ఆధ్వర్యంలో గత నెల 28న ప్రారంభమైన శిబిరం ఈనెల 26 వరకు కొనసాగుతుందని మాస్టర్‌ ఖాజాపాషా తెలిపారు. ఉదయం 6 నుంచి 8గంటల వరకు క్లాస్‌ చెబుతున్నారు. ఇందులో భాగంగా విద్యార్థులకు కరాటే, ఉషు, వెపన్స్‌, సెల్ఫ్‌ డిఫెన్స్‌, వెయిట్‌ లాస్‌, ఫిట్‌నెస్‌ వంటివి నేర్పిస్తున్నారు. చిన్నారులు ఆయా కళల్ని ఉత్సాహంగా ఆకళింపు చేసుకుంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement