మొయినాబాద్: నగరంలోని గుడిమల్కాపూర్ మార్కెట్ అజీజ్‌నగర్‌కు తరలిరానుంది. హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారికి ఇరుపక్కల అజీజ్‌నగర్, హిమాయత్‌నగర్ రెవెన్యూలో 42.32 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయింపునకు ఇటీవల కేబినెట్ ఆమోదించింది. ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చిన వెంటనే మార్కెటింగ్ శాఖకు భూమి అప్పగించేందుకు రెవెన్యూ అధికారులు సిద్ధంగా ఉన్నారు.
ట్రాఫిక్ అంతరాయం తగ్గించేందుకు
నగరంలోని మెహదీపట్నం సమీపంలో ఉన్న గుడిమల్కాపూర్‌లో 1992లో నాటి ప్రభుత్వం అప్పటి అవసరాలకు అనుగుణంగా కూరగాయలు, పూల మార్కెట్ నిర్మించారు. ఆరు ఎకరాల విస్తీర్ణంలో కూరగాయల మార్కెట్, 11 ఎకరాల్లో పూలమార్కెట్ కొనసాగుతున్నాయి. నిత్యం వేల మంది రైతులు కూరగాయలు, పూలు తీసుకుని మార్కెట్‌కు వెళ్తున్నారు. ప్రతి రోజు 20–25 టన్నుల కూరగాయలు, 30–40 టన్నుల పూలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్నాయి. రైతులతోపాటు, ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి అయ్యే కూరగాయలు, పూలను లారీలు, డీసీఎంలలో తీసుకొస్తుంటారు. కూరగాయలు, పూలు కొనడానికి వచ్చేవారు సైతం వాహనాల్లోనే వస్తారు. మార్కెట్ స్థాయికి మించి వాహనాలు వస్తుండడంతో నిత్యం ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతోంది. పండుగల సమయంలో మార్కెట్ వద్ద గంటల తరబడి వాహనాలు నిలిచిపోతుంటాయి. దూర ప్రాంతాల నుంచి మార్కెట్‌కు వచ్చే రైతులు ట్రాఫిక్ సమస్యతో నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు మార్కెట్‌లో దళారులు ఎక్కువై రైతులు నష్టపోతున్నారు. మౌలిక సదుపాయాలు సైతం సరిగా లేవు. ఈ పరిస్థితులను అధిగమించడానికే మార్కెట్‌ను నగర శివారు ప్రాంతాలకు తరలించే ప్రక్రియను ప్రభుత్వం మొదలు పెట్టింది.
ఓఆర్‌ఆర్‌కు చేరువలో...
సమీకృత మార్కెట్ ఏర్పాటుకు మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అజీజ్‌నగర్, హిమాయత్‌నగర్ రెవెన్యూల్లోని ప్రభుత్వ భూములను పరిశీలించారు. అజీజ్‌నగర్ రెవెన్యూలోని సర్వేనెంబర్ 176, హిమాయత్‌నగర్ రెవెన్యూలోని సర్వేనెంబర్ 151లో మొత్తం 60 ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులు పరిశీలించారు. సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేశారు. వీటిలో కొంత భూమిపై కోర్టు కేసులు ఉండడంతో క్లియర్‌గా ఉన్న 42.32 ఎకరాల భూమిని మార్కెట్ ఏర్పాటుకు ప్రతిపాదించారు. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో సమీకృత మార్కెట్ ఏర్పాటుకు 42.32 ఎకరాల భూమిని కేటాయిస్తూ మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఈ ప్రాంతం ఔటర్ రింగ్‌రోడ్డుకు కేవలం రెండు కిలో మీటర్ల దూరంలో.. హైదరాబాద్–బీజాపూర్ రహదారికి ఇరువైపులా ఉండటంతో దూర ప్రాంతాల నుంచి వచ్చేవారితోపాటు స్థానిక రైతులకు అనువుగా ఉంటుంది. భూకేటాయింపునకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే మార్కెటింగ్ శాఖకు భూమి అప్పగించే అవకాశం ఉంది.
మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అజీజ్‌నగర్‌లో సమీకృత మార్కెట్ ఏర్పాటు చేయడంతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. రైతులకు మార్కెట్ అందుబాటులోకి వస్తుంది. ఓఆర్‌ఆర్ పక్కనే ఉండటంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారికి ట్రాఫిక్ సమస్యలు తలెత్తవు. మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలో మార్కెట్ ఏర్పాటు చేస్తున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు.
– సోనియాదర్శన్,
మున్సిపల్ చైర్‌పర్సన్, మొయినాబాద్
అజీజ్‌నగర్, హిమాయత్‌నగర్ రెవెన్యూల్లోని సర్వేనెంబర్ 176, 151లో మొత్తం 60 ఎకరాల ప్రభుత్వ భూమిని సమీకృత మార్కెట్ ఏర్పాటుకోసం పరిశీలించి సర్వే చేశాం. కోర్టు కేసులు లేకుండా ఉన్న 42.32 ఎకరాల భూమికి సంబంధించి పూర్తి వివరాలతో ప్రభుత్వానికి నివేదిక పంపాం. ఇటీవల మంత్రివర్గ సమావేశంలో దీన్ని కేబినెట్ ఆమోదించింది. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాగానే మార్కెటింగ్ శాఖకు భూమిని అప్పగిస్తాం. కోర్టు కేసులు పరిష్కారం తర్వాత మిగిలన భూమి ఇస్తాం.
– గౌతమ్‌కుమార్, తహసీల్దార్, మొయినాబాద్
హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారికి ఇరువైపులా ఏర్పాటు
42.32 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయింపునకు కేబినెట్ ఆమోదం
ప్రభుత్వ ఉత్తర్వులు రాగానే మార్కెటింగ్ శాఖకు భూమి అప్పగింత


