మంచాల: సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటును ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాయతీలు అందిస్తోందని రాష్ట్ర విద్యుత్ శాఖ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ అన్నారు. ప్రజాపాలన’–ప్రగతి ప్రణాళ/క కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని రైతువేదికలో రైతులకు సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుపై అవగాహన కల్పించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం సోలాలర్ విద్యుత్ వినయోగంలోకి తెచ్చేందుకు విశేషంగా కృషి చేస్తోందన్నారు. సౌరశక్తి నిరంతరం లభించే స్వచ్ఛమైన హరిత శక్తి అన్నారు. రాష్ట్రంలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి 10,642 మెగా వాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం అందుబాటులోకి వచ్చిందన్నారు. 2029–30 నాటికి 29, 645 మెగావాట్లు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందని వివరించారు. పీఎం కుసుమ్–ఎ పథకం ద్వారా రైతులు తమ భూముల్లో 0.5 మెగా వాట్ల–2.0 మెగా వాట్ల సామర్థ్యం కలిగిన సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. ఒక మెగా వాట్ ప్లాంట్ ఏర్పాటుకు సుమారు 3.5ఎకరాల భూమి అవసరమవుతుందన్నారు. చిన్న, సన్నకారు రైతులు ఇద్దరు లేదంటే ముగ్గురు కలిసి గ్రూపులగా ఏర్పడి సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. సోలార్ ఆధారిత డెమో పంప్‌సెట్లు, సౌర విద్యుత్ ప్లాంట్లను పరిశీలన చేసి రైతులకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీజీ ఎస్‌పీడీసీఎల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ లక్ష్మీనారాయణ, ఆర్డీఓ అనంతరెడ్డి, వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఉష, ఏఓ వెంకటేశ్, విద్యుత్ శాఖ డీఈఈ నరేశ్ కుమార్, ఏడీఏ సుజాత, ఏడీఈ సీతారాములు, ఏఈఈలు బాజీసింగ్, అఖిలేష్, రైతులు తదితరులు పాల్గొన్నారు.


