షాద్‌నగర్: తప్పుడు కేసుల నమోదుపై వెంటనే విచారణ చేపట్టాలని షాద్‌నగర్ డీసీపీకి పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ(పీసీఏ) బుధవారం నోటీసులు జారీ చేసింది. వివరాలు... తమపై తప్పుడు కేసులు పెట్టి నందిగామ పోలీసులు వేధిస్తున్నారని మార్చి 23వ తేదీనన నందిగామ మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన కొంగర మహేశ్, యాదమ్మ, శేఖర్, వెంకటేశ్ పీసీఏను ఆశ్రయించారు. తప్పుడు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం, ఫిర్యాదు తేదీలను తారుమారు చేయడం, ఫోర్జరీ సంతకాలతో చార్జిషీట్ దాఖలు చేయడమే కాకుండా బాధితుల నుంచి లంచాలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. రాజకీయ ఒత్తిళ్లతో నిందితులకు కొమ్ముకాస్తూ తాము ఆధారాలు సమర్పించినా కేసు నమోదు చేయకుండా తమపైనే కేసులు పెడుతున్నారని పేర్కొన్నారు. ఈ ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన పీసీఏ క్రైం నెంబర్ 112/2025 రిజిస్ట్రేషన్ చార్జిషీట్ సమర్పించిన పరిస్థితులు, బాధితులు గతంలో ఇచ్చిన ఫిర్యాదులపై తీసుకున్న చర్యలు, లంచాల వసూలు, ఫోర్జరీ సంతకాలపై పోలీసుల పాత్ర వంటి అంశాలపై విచారణ జరిపించి ఈనెల 15 తేదీలోగా నివేదిక అందించాలని షాద్‌నగర్ డీసీపీకి నోటీసులు జారీ చేశారు.
కడ్తాల్: నూతన మండలముగా ఏర్పడిన కడ్తాల్‌లో ప్రభుత్వాస్పత్రి, 108 వాహనం ఏర్పాటు చేయాలని ఏవీబీవీ మండల అధ్యక్షుడు దోనాదుల మహేశ్ కోరారు. బుధవారం ఆయన రాజ్‌భవన్‌లో గవర్నర్ శివప్రతాప్ శుక్లా, కేంద్ర సివిల్ డిఫెన్స్ మంత్రి ధరంవీర్ ప్రజాప్రతిని కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ప్రభుత్వాస్పత్రి, 108 వాహనం లేక మండల వాసులు పడుతున్న ఇబ్బందులను గవర్నర్‌కు వివరించారు. ఆయన వెంట జాపాల సుధాకర్, కాసుల సురేశ్, హరిబాబు, రవి, ఎగిరిశెట్టి రాజు, ఈశ్వర్, నరేశ్, తదితరులు ఉన్నారు.
ఇబ్రహీంపట్నం రూరల్: ఉప్పరిగూడ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం డైరెక్టర్ పదవులకు ఇద్దరు రాజీనామా చేశారు. ఈ మేరకు బుధవారం పీఏసీఎస్ సీఈఓ గణేశ్‌కు రాజీనామా లేఖలను అందజేశారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్మన్‌గా ఎన్నికై న టేకుల సుదర్శన్‌రెడ్డి, కౌన్సిలర్‌గా గెలుపొందిన క్యామా శంకర్ పీఏసీఎస్ డైరెక్టర్లుగా ఉన్నారు. జోడి పదవులు ఉండకూడదని రాజీనామా చేసినట్లు తెలిపారు .
సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ ముకుందరెడ్డి
కొడంగల్ రూరల్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొడంగల్ పర్యటన నేపథ్యంలో పండుగ వాతావరణం ఉట్టిపడేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ ముకుందరెడ్డి సూచించారు. బుధవారం పట్టణంలోని కడా కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సీఎం పర్యటన ఏర్పాట్లపై సమీక్ష చేశారు. సభా వేధిక, ప్రాంగణం, పార్కింగ్, ఎల్‌ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో పౌర సంబంధాల శాఖ అదనపు సంచాలకులు జగన్, కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి, ఆర్‌ఐఈ రాములు, డీపీఆర్‌ఓ చెన్నమ్మ తదితరులు పాల్గొన్నారు.


