మీర్‌పేట: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి అన్నారు. బుధవారం ఆమె ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా బడంగ్‌పేట సర్కిల్ ప్రశాంతిహిల్స్ డివిజన్‌లోని క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ సమ్మర్ క్యాంపును టీయూఎఫ్‌ఐడీసీ చైర్మన్ చల్లా నర్సింహారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థుల అభివృద్ధికి క్రీడలు దోహదపడతాయని, కాలనీల్లోని ఖాళీ స్థలాలను పార్కులుగా అభివృద్ధి చేసి కబడ్డీ, షటిల్, టెన్నిస్ కోర్టులను ఏర్పాటు చేసి పిల్లలకు శిక్షణ ఇవ్వాలని సూచించారు. అనంతరం చల్లా నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియని, ప్రజల వద్దకు వెళ్లాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 99 రోజుల ప్రణాళిక కార్యక్రమానికి నిర్వహిస్తున్నారని చెప్పారు. విద్యతో క్రీడలకు ప్రాధాన్యత ఇచ్చేలా ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో 20 ఎకరాల్లో ఇంటర్నేషనల్ స్కూళ్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ముందు చూపుతో మీర్‌పేట ప్రాంతంలో క్రీడా ప్రాంగణాన్ని అభివృద్ధి చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. రాజకీయాలకు అతీతంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఆయన చెప్పారు. డీసీ సమ్మయ్య మాట్లాడుతూ క్యాంపులో కబడ్డీ, కరాటే, ఖోఖో తదితర క్రీడల్లో అనుభవజ్ఞులైన కోచ్‌లతో శిక్షణ ఇస్తామని వివరించారు. కార్యక్రమంలో స్పోర్ట్స్ ఇన్‌స్పెక్టర్ సంతోశ్, ఏఎంహెచ్‌ఓ డాక్టర్ ప్రవీణ్, ఏఈ గంగాప్రసాద్, ఎస్.హరీశ్, సౌజన్య, నాయకులు అర్కల భూపాల్‌రెడ్డి, చల్లా బాల్‌రెడ్డి, అనిల్‌యాదవ్, దోమలపల్లి రాజ్‌కుమార్, అర్కల కామేశ్‌రెడ్డి, సిద్దాల శ్రీశైలం, భూపేశ్‌గౌడ్, నర్సిరెడ్డి, మాదరి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి సబితారెడ్డి


