● రోడ్డుకు అడ్డంగా పడిపోయిన మొక్కజొన్న బస్తాలు
● భారీగా ట్రాఫిక్ జామ్
కందుకూరు: మొక్కొజొన్న లోడుతో హైదరాబాద్ వైపు వెళ్తూ ఓ డీసీఎం వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ సంఘటన కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కడ్తాల్ నుంచి మొక్కజొన్న లోడుతో వెళ్తున్న డీసీఎం వాహనం శ్రీశైలం రహదారిపై దెబ్బడగూడ గేట్ సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈఘటనలో ఎవరికీ ప్రమాదం జరగలేదు. మొక్కజొన్న సంచులు రోడ్డుపై పడిపోవడంతో ఇరువైపులా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సమాచారం అందుకున్న పోలీసులు క్రేన్ ద్వారా వాహనాన్ని పక్కకు జరిపారు. జేసీబీతో మొక్కజొన్న సంచులను రోడ్డు పక్కకు తరలించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. దీంతో వాహనదారులు ఊపిరి తీసుకున్నారు.
రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య
తాండూరు రూరల్: ‘నేను చనిపోతున్నా.. నన్ను క్షమించండి నాన్న’ అంటూ ఓ యువుకుడు వీడియోకాల్ చేసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన పెద్దేముల్ మండలం రేగొండి గ్రామంలో బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రైల్వే పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన శరత్(30).. మంగళవారం సాయంత్రం గ్రామ సమీపంలోని రుక్మాపూర్– తాండూరు రైల్వే పట్టాల వద్ద గూడ్స్ రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అంతకు ముందు మృతుడు.. తండ్రి వెంకటయ్యకు వీడియో కాల్ చేసి, అఘాయిత్యానికి పూనుకున్నాడు. వెంటనే స్పందించిన కుటుంబీకులు రేగొండి సమీపంలోని రైలు పట్టాల పరిసరాల్లో గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. రుక్మాపూర్ సమీపంలో తనువుచాలించాడు. శరత్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమ్తితం తాండూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని రైల్వే హెడ్ కానిస్టేబుల్ వీరేశం తెలిపారు. మృతుడికి భార్య విజయలక్ష్మి, ఏడాది బాలుడు ఉన్నారు. చావుకు కారణాలు తెలియరాలేదు.
హైడ్రా ప్రజావాణికి 4 వారాల విరామం
సాక్షి, సిటీబ్యూరో: హైడ్రా ప్రజావాణికి నాలుగు వారాల పాటు విరామం ప్రకటిస్తున్నట్లు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వేలాదిగా వచ్చిన ఫిర్యాదులను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. మిగిలిన అర్జీలను పూర్తిగా క్లియర్ చేయడానికి మరో నాలుగు వారాల సమయం పడుతుందని అంచనా వేస్తున్నామన్నారు. జూన్ 8 నుంచి యథావిధిగా ప్రజావాణి కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. గతంలో ఇచ్చిన ఫిర్యాదులపై అత్యవసరమైతే కార్యాలయానికి వచ్చి కలవవచ్చని ఆయన సూచించారు.
జీపీ ట్రాక్టర్ చోరీ కేసులో ట్విస్ట్
మాజీ సర్పంచ్‌కు రిమాండ్
యాలాల: గ్రామ పంచాయతీ ట్రాక్టర్ చోరీ ఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది. ప్రధాన సూత్రధారిగా పేర్కొంటూ మాజీ సర్పంచ్‌తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొని, రిమాండ్‌కు తరలించారు. ఎస్‌ఐ విఠల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని బషీర్‌మియాతండా ట్రాక్టర్‌ను డ్రైవర్ సుభాష్ ఎప్పటిలాగే ఈ నెల 3న గ్రామ సమీపంలోని వాటర్ ట్యాంకు వద్ద పార్క్ చేశారు. కాగా మరుసటి రోజు నుంచి అది కనిపించలేదు. దీంతో పంచాయతీ కార్యదర్శి వెంకట్‌రెడ్డి మంగళవారం ట్రాక్టర్ కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు.. తండా నుంచి వెళ్లే మార్గాల్లో సీసీ ఫుటేజీలను పరిశీలించగా.. ట్రాక్టర్ ఘట్‌కేసర్ ప్రాంతం వైపు వెళ్లినట్లు గుర్తించారు. వాహనం ఉన్న ప్రాంతానికి వెళ్లి, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. చోరీ గురించి ఆరా తీయగా, ప్రధాన సూత్రధారిగా మాజీ సర్పంచ్ మిత్రు ఉన్నట్లు గుర్తించారు. అతనితో పాటు అతని బంధువులు రాథోడ్, కిరణ్ ఉన్నట్లు పేర్కొన్నారు.


