షాద్‌నగర్: వృద్ధుల సేవాశ్రమం నిర్వహిస్తూ 25 ఏళ్లుగా సేవలందిస్తున్న పట్టణానికి చెందిన రంగారెడ్డి దాసరి నారాయణరావు సేవారత్న అవార్డు అందుకున్నారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దాసరి నారాయణరావు జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్న పలువురికి నిర్వాహకులు దాసరి నారాయణ రావు సేవారత్న అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా షాద్‌నగర్ పట్టణంలోని అయ్యప్ప కాలనీలో 25 ఏళ్లుగా నవోదయ వృద్ధాశ్రమాన్ని నిర్వహిస్తూ వృద్ధులకు సేవ చేస్తున్న రంగారెడ్డి సేవారత్న అవార్డుకు ఎంపికయ్యారు. సాంస్కృతిక శాఖ డైరక్టర్ డాక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.
కందుకూరు: విద్యార్థులకు విద్యాబోధనతో పాటు ఉత్తమ సేవలు అందిస్తున్న మండల పరిధిలోని సాయిరెడ్డిగూడ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అండేకార్ నాగరత్నం రాష్ట్రస్థాయిలో ప్రశంసా పత్రం అందుకున్నాడు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచడంతో పాటు వారికి నాణ్యమైన విద్య అందించడం, సమాజంలో మంచి పౌరులుగా ఎదిగేలా తర్ఫీదు ఇవ్వడం, తన సొంత పిల్లలను కూడా అదే పాఠశాలల చదివించి ఆదర్శంగా నిలవడం, కోర్టులు, ఇతర ప్రభుత్వ శాఖల పని తీరును తెలుసుకునేలా విద్యార్థులను నేరుగా తీసుకెళ్లడం లాంటి చేస్తుండడంతో ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు ఐఏఎస్, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఈ.నవీన్ నికోలస్ ఆయనను సన్మానించి ప్రశంసా పత్రం అందించారు.
ఎమ్మెల్సీ కవితను కలిసి ఫార్మా భూ బాధితులు
యాచారం: ఫార్మాసిటీ భూ బాధితులు మంగళవారం ఎమ్మెల్సీ కవితను నగరంలోని ఆమె నివాసంలో కలిశారు. గత బీఆర్‌ఎస్ సర్కార్ మాదిరిగానే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందని తెలిపారు. గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు నిర్మాణం కోసం బలవంతపు భూసేకరణ చేస్తోందని, 40 రోజులకు పైగా రైతులు దీక్షలు చేస్తున్నా చలనం లేదన్నారు. ఫార్మాసిటీ పేరుతో రైతుల పేర్లపై ఉన్న భూ రికార్డులను టీజీఐఐసీ పేరు మీద మార్చేసి, పరిహారాన్ని అథారిటీలో జమ చేసి ఆ భూములు సర్కార్‌వేనని భయపెట్టాలని చూస్తున్నారని వాపోయారు. దీంతో స్పందించిన ఆమె త్వరలోనే కుర్మిద్ద తండాలో గిరిజన రైతులు చేస్తున్న దీక్ష వద్దకు వచ్చి సంఘీభావం తెలుపుతానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నక్కర్తమేడిపల్లి, నానక్‌నగర్, తాడిపర్తి, కుర్మిద్ద గ్రామా ల రైతులతో పాటు ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు కవుల సరస్వతి, నేనావత్ శ్రీకాంత్‌నాయక్, కిషన్ నాయక్ పాల్గొన్నారు.
కందుకూరు: సిటిజన్ విజిలెన్స్, మానిటరింగ్ జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల కేంద్రంలో మంగళవారం దళిత, గిరిజన, ఆదివాసి, ప్రజాసంఘాలు, మేధావులు, విలేకరులు, న్యాయవాదులు, డీవీఎంసీ సభ్యులు సమావేశమై కమిటీని ఎన్నుకుని ప్రకటించారు. జిల్లా కన్వీనర్‌గా బోడ కృష్ణ, కో కన్వీనర్‌గా జోగు రమేష్, సభ్యులుగా దివ్యశ్రీ, కంబాలపల్లి సంతోష, దరువుల శంకర్, మిన్నాల డేవిడ్, మమత, రఘు, రాములు, యాచారం మండల కన్వీనర్‌గా బడే భాగ్యమ్మను ఎన్నికయ్యారు. కార్యక్రమంలో డీబీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు గండు నరసింహ, హైకోర్టు అడ్వకేట్ దివ్యశ్రీ, అంబేడ్కర్ జాతర ఫౌండర్ జి.సుధాకర్, ప్రజా సంఘాల నాయకులు నరసింహ, శేఖర్, యాదయ్య, భగవంతు, బాలమణి, కుమార్, సంతోష్, తాండ్ర యాదయ్య, గోరేటి జగన్ పాల్గొన్నారు.


