రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి
యాచారం: మహానగరం, కొత్తగా ఏర్పాటయ్యే ఫ్యూచర్‌సిటీకి సరిపడే కూరగాయలు, పండ్లను జిల్లా రైతులు అందించాలన్నదే లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి పేర్కొన్నారు. ఆ దిశగా ఎన్ని నిధులైనా ఖర్చు చేయడానికి సర్కార్ సిద్ధంగా ఉందన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా మంగళవారం మండల కేంద్రంలో జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో డివిజన్ స్థాయి రైతు వారోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూరగాయల పంటలు, పండ్లతోటలు పెంపకం చేసే రైతులకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కూరగాయల, పండ్ల తోటల మార్కెట్లో దళారీ వ్యవస్థను రూపుమాపడం కోసం కృషి చేస్తున్నట్లు చెప్పారు. త్వరలో యాచారంలో రెండు ఎకరాల్లో మోడల్ కూరగాయల మార్కెట్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. పలువురు శాస్త్రవేత్తలు పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ కార్యదర్శి గోపాల్, ఉద్యాన, పట్టుపరిశ్రమల శాఖ అడిషనల్ డైరెక్టర్ సరోజినిదేవి, జిల్లా వ్యవసాయాధికారి ఉష, జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమల అధికారి సురేష్, ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంత్‌రెడ్డి, వ్యవసాయ శాఖ ఏడీఏ సుజాత, యాచారం తహసీల్దార్ అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు.


