ఇనాం భూములకు
చేవెళ్ల: ఆలూరులో ఏళ్ల తరబడిగా సాగు చేసుకుంటున్న ఇనాం భూములకు సంబంధించి రైతులకు ఓఆర్‌సీలు ఇవ్వాలని గ్రామ రైతులు, నాయకులు కోరారు. ఈ మేరకు మంగళవారం ఆర్డీఓ పార్థసింహారెడ్డికి విజ్ఞప్తి చేశారు. వక్ఫ్ బోర్డు భూములపై రైతుల పక్షాన హైకోర్టులో వచ్చిన ఆర్డర్‌ను జత చేసి ఓఆర్‌సీలు ఇవ్వాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలో ఉన్న 1,248 ఎకరాల భూములను తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్నట్టు తెలిపారు. పట్టాలు లేకపోవడంతో ఇవి వక్ఫ్‌బోర్డు భూములుగా ప్రాచుర్యం పొందాయన్నారు. కొన్నేళ్ల కిత్రమే పలువురు రైతులు ఇవి వక్ఫ్ బోర్డు భూములు కావని, ఇనాం భూములని చట్ట ప్రకారం రావాల్సిన ఓఆర్‌సీ పట్టాలు ఇవ్వాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు. కోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని, కోర్టు ఆదేశాల ప్రకారం ఓఆర్‌సీ పట్టాలు ఇవ్వాలని కోరారు. స్పందించిన ఆర్డీఓ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.


