ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి | - | Sakshi
Sakshi News home page

ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

May 6 2026 9:01 AM | Updated on May 6 2026 9:01 AM

ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి ప్రమాదం.. విషాదం

రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన గ్రామ అధికారి

ఆమనగల్లు: ఇంటి స్థలం పేరు మార్పి డి కోసం ఓ వ్యక్తి నుంచి రూ.20 వేలు తీసుకుంటూ తలకొండపల్లి మండలం వెల్జాల కార్యదర్శి శరత్‌కుమార్‌ మంగళవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కుమార్‌ వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.. వెల్జాలకు చెందిన ఓ వ్యక్తి గ్రామంలోని ఓ పాత ఇంటిని కొనుగోలు చేసి, తన తల్లిపేరున రిజిస్ట్రేషన్‌ చేయించాడు. ఇటీవల ఇంటిని కూల్చేసి, ఖాళీ స్థలాన్ని విక్రయానికి పెట్టాడు. ఇందుకోసం వాల్యుయేషన్‌, నో డ్యూ సర్టిఫికెట్లు ఇవ్వాలని జీపీ సెక్రటరీ శరత్‌కుమార్‌ను కోరగా రూ.30 వేలు డిమాండ్‌ చేశాడు. ఆ తర్వాత స్థానిక వార్డు సభ్యుడు జోక్యం చేసుకుని సర్ది చెప్పడంతో సర్టిఫికెట్లు అందజేశాడు. అనంతరం సదరు వ్యక్తి స్థలాన్ని విక్రయించగా, తనకు రూ.30 వేలు ఇవ్వాలని సెక్రటరీ డిమాండ్‌ చేశాడు. రూ.20 వేలు ఇస్తానని చెప్పిన బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించాడు. వారి సూచన మేరకు వెల్జాల గ్రామ పంచాయతీ కార్యాలయంలో రూ.20 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి శరత్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని స్వస్థలమైన నాగర్‌కర్నూల్‌లోని ఇంట్లో కూడా తనిఖీలు చేశారు.

సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం

ఇద్దరు చేవెళ్ల వాసుల మృతి

శోకసంద్రంలో కుటుంబాలు

చేవెళ్ల: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదం నింపింది. తుల్జాపూర్‌లోని భవాని మాత దర్శనానికి కారులో వెళ్లి వస్తుండగా మంగళవారం జహీరాబాద్‌ వద్ద ఆగిఉన్న టాటా ఏసీ వాహనాన్ని ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మున్సిపల్‌ పరిధిలోని కేసారం గ్రామానికి చెందిన కాసుల మహేశ్‌గౌడ్‌ (27), ఆలూరుకు చెందిన రోహిత్‌ (15) అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురు నగరంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అటు కేసారం, ఇటు ఆలూరులో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబసభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు.

ఇసుక డంప్‌ సీజ్‌

బషీరాబాద్‌: మండలంలోని జీవన్గీ గ్రామ శివారు కాగ్నానది ఒడ్డున నిల్వ చేసిన భారీ ఇసుక డంపును రెవెన్యూ అధికారులు మంగళవారం సీజ్‌ చేశారు. నదీ పరీవాహక గ్రామాలైనా క్యాద్గీరా, జెట్టూరు గ్రామాల సర్పంచులు జైపాల్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, రైతులు సూర్య ప్రకాశ్‌ రెడ్డి, మల్లికార్జున్‌, బల్‌రామ్‌ మంగళవారం తహసీల్దార్‌ కార్యాలయానికి వచ్చి ఇసుక డంపు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. రంగంలోకి దిగిన జీపీఓలు అస్లాం, మధు, రికార్డు అసిస్టెంట్‌ మున్నెప్ప అక్కడికి చేరుకొని 15 ట్రాక్టర్ల ఇసుకను సీజ్‌ చేశారు. ఈ ఇసుక మహబూబ్‌నగర్‌కు చెందిన ఓ మాజీ ఎంపీకి చెందినదిగా ఫిర్యాదు పేర్కొన్నారు. గోశాల నిర్మాణం కోసం డంపు చేసినట్లు అధికారుల విచారణలో తేలింది.

Advertisement
 
Advertisement
Advertisement