మంచాల: వ్యవసాయ పంటల సాగులో రసాయనిక ఎరువుల వాడకం తగ్గించాలని జిల్లా వ్యవసాయాధికారి డి.ఉష అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో సోమవారం నిర్వహించిన రైతు వారోత్సవాలకు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులు పంటల సాగు విషయంలో నూతన పద్ధతులు అవలంబించాలన్నారు. సేంద్రియ పద్ధతిలో పంటలను సాగు చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. భూసార పరీక్షలు చేయించుకొని నేలలో పోషకాల లోపాలను గుర్తించాలని, తదనుగుణంగా ఎరువులు వాడాలన్నారు. లైసెన్స్ ఉన్న ఫర్టిలైజర్ దుకాణాల్లోనే ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేయాలని సూచించారు. రైతులకు నానో యూరియా అందుబాటులో ఉంచుతామని తెలిపారు. పచ్చి రొట్ట ఎరువులు సబ్సిడీపై అందుబాటులో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో ఏడీఏ సుజాత, ఏఓ వెంకటేశ్, సర్పంచ్ మానస వినయ్, వ్యవసాయాధికారులు వనజాత, హరినాథ్, నవీన, లింగస్వామి, నిఖిత, సాయిసిరి, రైతు సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.


