షాద్‌నగర్‌రూరల్: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజావాణి కార్యక్రమాన్ని చేపట్టిందని ఆర్డీఓ ఆర్‌ఎన్ సరిత అన్నారు. మండల పరిధిలోని లింగారెడ్డిగూడ సమీపంలోని ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. గతంలో తమ సమస్యలను విన్నవించేందుకు ప్రజలు కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణికి వెళ్లాల్సివచ్చేదని అన్నారు. ఇప్పుడు ప్రభుత్వం డివిజన్ పరిధిలోని ఆర్డీఓ కార్యాలయాల్లోనే కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని తెలిపారు. డివిజన్ స్థాయిలోని అన్నిశాఖల అధికారులు అందుబాటులో ఉంటారని, ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులు, విజ్ఞప్తులు, దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరిస్తారని చెప్పారు. కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ విజయలక్ష్మి, హౌసింగ్ డీఈ సురేష్, ఆర్‌అండ్‌బీ ఏఈ రాజశేఖర్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికే ప్రజావాణి
చేవెళ్ల: ప్రజా సమస్యల పరిష్కారంకోసమే ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందని చేవెళ్ల ఆర్డీఓ పార్థసింహారెడ్డి అన్నారు. చేవెళ్ల ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు వారి సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రతి సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజావాణి కార్యక్రమం ఉంటుందని చెప్పారు. అర్జీలను పరిశీలించి ఆయా శాఖల ద్వారా తక్షణమే పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ ప్రజావాణిలో ఏడు ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. ఇందులో హౌసింగ్ శాఖకు సంబంధించి 4, పెన్షన్ కోసం 1, ఎస్సీ కార్పొరేషన్ రుణాలకోసం 2 అర్జీలు వచ్చినట్లు చెప్పారు. కార్యక్రమంలో అన్నిశాఖలకు సంబంధించి అధికారులు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికి చర్యలు
ఇబ్రహీంపట్నం: డివిజన్ స్థాయి ప్రజావాణిని సోమవారం ఇబ్రహీంపట్నం మండల పరిషత్ కార్యాలయంలో ఆర్డీవో అనంతరెడ్డి నిర్వహించారు. రాష్ట్ర ప్రజావాణి కో–ఆర్డినేటర్ రాకేష్‌రెడ్డి సందర్శించి పిటిషనర్లకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్రతి దరఖాస్తును ఆన్‌లైన్‌లో పొందుపరిచి, ఆయా శాఖల అధికారులకు పంపించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. భూ భారతికి సంబంధించి 27, ఇందిరమ్మ ఇళ్లకు 4, ఇనామ్ భూములకు 4, సాదాబైనామా 3, విద్యుత్ శాఖకు సంబంధించి 3 దరఖాస్తులు వచ్చినట్లు ఆర్డీవో అనంతరెడ్డి వెల్లడించారు. కార్యక్రమానికి విద్యుత్ శాఖ డీఈఈ నరేష్‌కుమార్, డీఎల్‌పీఓ సాధన, సీడీపీఓ వినీత, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు.


