విషాదం నింపిన ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

విషాదం నింపిన ప్రమాదం

May 5 2026 7:02 AM | Updated on May 5 2026 7:02 AM

శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ఇద్దరు యువ ఫొటోగ్రాఫర్ల దుర్మరణం

శోకసంద్రంలో మృతుల కుటుంబాలు

మంచాల: పొట్టకూటి కోసం ఇంటి నుంచి బయలు దేరిన ఫొటోగ్రాఫర్లు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. కుటుంబ సభ్యులకు తీరని విషాదం నింపారు. రెక్కాడితేగానీ డొక్కాడని నిరుపేదల కుటుంబాలు. ఇప్పుడిప్పడే యువకులు చేతికి వచ్చి కుటుంబానికి ఆసరా ఉంటున్నారు. రోడ్డు ప్రమాదం వారి ఇళ్లలో చీకట్లు నింపింది. ఆదివారం సిద్దిపేటలోని శివం గార్డెన్‌లో ఓ శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రజ్ఞాపూర్‌ రింగ్‌రోడ్డు వద్ద కారు అదుపుతప్పడంతో మండల పరిధిలోని తిప్పాయిగూడకు చెందిన గ్యార గౌతమ్‌(21), ఆగాపల్లికి చెందిన అన్నారం అఖిల్‌(23) అక్కడికక్కడే దుర్మరణం చెందారు.

శోకసంద్రంలో తిప్పాయిగూడ

తిప్పాయిగూడకు చెందిన గ్యార పెంటయ్య–మనోహర దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు గౌతమ్‌ ఇప్పుడిప్పుడే పనులు చేసుకుంటూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. సాఫీగా సాగుతున్న వీరి ప్రయాణంలో రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఎదిగిన కొడుకు కుటుంబానికి అండగా ఉంటాడనుకుంటే దేవుడు తీసుకెళ్లాడంటూ కుటుంబ సభ్యులు రోదించిన తీరు గ్రామస్తులను కంటతడి పెట్టించింది. ఆగాపల్లికి చెందిన అన్నారం సంతోష–శేఖర్‌ దంపతులకు ఒక్కగాను ఒక్క కొడుకుడు అఖిల్‌(23) కొన్ని రోజులుగా ఫొటోగ్రాఫర్‌ వృత్తిలో పని చేస్తున్నాడు. పనికి వెళ్లిన కొడుకు శవమై తిరిగిరావడంతో తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. ఉన్న ఒక్క కొడుకు చనిపోయాడు మేము ఎవరి కోసం బతకాలని రోదిస్తున్నారు. అందరితో కలివిడిగా ఉండే అఖిల్‌ మృతితో ఆగాపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. సోమవారం మృతుల అంత్యక్రియలు పూర్తి చేశారు. ఆగాపల్లికి చెందిన అనిరుద్‌ ప్రస్తుతం నగరంలోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

గ్యార గౌతం (ఫైల్‌)

అన్నారం అఖిల్‌ (ఫైల్‌)

Advertisement
 
Advertisement
Advertisement