మీర్‌పేట: హిట్ అండ్ రన్ కేసులో కారు డ్రైవర్‌ను రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన మీర్‌పేట ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. ఈ నెల 1వ తేదీన రాత్రి గాయత్రీ నగర్ వద్ద మీర్‌పేటకు చెందిన తండ్రీకొడులు జిలానీ, ఫైజల్ బైక్ వెళ్తున్నారు. సింగరేణి కాలనీకి చెందిన కారు డ్రైవర్ నీలకంఠం సత్యనారాయణ బైక్‌కు సైడ్ ఇవ్వకపోవడంతో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో సత్యనారాయణ కారులో కూర్చుని ఫైజల్‌ను తోసేయడంతో డివైడర్‌పై పడి గాయపడ్డాడు. అక్కడ నుంచి తప్పించుకునేందుకు యత్నించగా జిలానీ బైక్‌ను కారుకు అడ్డుగా పెట్టాడు. ఆయన్ను ఢీకొట్టడంతో బానైట్‌పై పడ్డాడు. కారు ఆపకుండా రెండు కిలోమీటర్ల దూరం ప్రయాణించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు సత్యనారాయణను రిమాండ్‌కు తరలించారు.
కడ్తాల్: న్యామతాపూర్‌లోని ఓ వ్యవసాయ పొలం వద్ద గ్రామానికి చెందిన వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికుడు నల్లవోతుల లక్ష్మయ్య (30) గ్రామంలోని మద్దూరు రామిరెడ్డి వ్యవసాయ పొలం వద్ద కూలీ పనులు చేస్తూ జీవనం సాగించేవాడు. ఈనెల 2న శనివారం ఉదయం పనికి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు మూడు రోజుల పాటు వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. ఇదిలా ఉండగా సోమవారం ఉదయం ఊరి శివారులోని ఓ బావిలో మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు లక్ష్మయ్యగా గుర్తించడంతో బాడీని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి వివాహం కాలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని సీఐ సైదిరెడ్డి తెలిపారు. 40 అడుగుల లోతున్న బావిలో నుంచి శవాన్ని తీసేందుకు పోలీసులకు సహకరించిన స్థానికులు తానేషా, రాములును పీఎస్‌కు పిలిపించి సన్మానించడంతో పాటు నగదు అందించారు. ఎస్‌ఐలు వరప్రసాద్, చంద్రశేఖర్ ఉన్నారు.
మొయినాబాద్: బంధువుల రిసెప్షన్‌కు వెళ్లి తిరిగి వచ్చి ఇంట్లో పడుకున్న యువతి తెల్లవారే సరికి కనిపించకుండా పోయింది. ఈ సంఘటన మొయినాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అజీజ్‌నగర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. అజీజ్‌నగర్‌కు చెందిన డప్పు చంద్రయ్య కుటుంబం ఆదివారం రాత్రి బంధువుల రిసెప్షన్‌కు వెళ్లి అర్ధరాత్రి 12 గంటలకు ఇంటికి చేరుకున్నారు. సోమవారం ఉదయం 6 గంటలకు చంద్రయ్య నిద్ర లేచి చూడగా కూతురు చందన(19) కనిపించలేదు. పరిసర ప్రాంతాలు, బంధువులు, స్నేహితుల వద్ద వెతికారు. ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో మొయినాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.


